6 మున్సిపాలిటీల్లో 78.99 శాతం పోలింగ్ నమోదు
మొత్తం 1,76,023 మంది ఓటర్లకు గాను 1,39,044 మంది ఓటు హక్కు వినియోగం
ఆమన్‌గల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 84.8 శాతం పోలింగ్ నమోదు
అత్యల్ఫంగా షాద్‌నగర్‌లో 76.24 శాతం పోలింగ్
(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా): జిల్లాలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఒకటి, రెండుచోట్లా రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య చిన్నపాటి గొడవలు మినహా ఇతర్రతా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.దీంతో జిల్లాలో(6) ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, ఆమన్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఈ మున్సిపాలిటీల పరిధిలో సాయంత్రం 7 గంటల్లోపు 78.99 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, జిల్లాలో ఎన్నికలు జరిగిన ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1,76,023 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,39,044 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 70,318 మంది మహిళలు, 68,725 మంది పురుషులు ఉన్నారు.
ఆమన్‌గల్‌లో అత్యధికంగా 84.8 శాతం పోలింగ్
జిల్లాలో ఆమన్‌గల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 84.8 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 15 వార్డుల పరిధిలో 30 పోలింగ్ కేంద్రాల్లో 16,984 మంది ఓటర్లకు గాను 14,403 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీలో 81.44 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 18 వార్డుల్లో 37 పోలింగ్ కేంద్రాల పరిధిలో 25,371 మంది ఓటర్లు ఉండగా, 20,661 మంది ఓటు వేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 52 పోలింగ్ కేంద్రాల్లో 80.24 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 26 వార్డుల్లో మొత్తం 32,871 మంది ఓటర్లు ఉండగా, 26,377 మంది ఓటు వేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 78.45 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 24 వార్డుల పరిధిలోని 48 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 25,993 మంది ఓటర్లకు గాను 20,392 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలో 77.09 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మున్సిపాలిటీలో 15 వార్డుల్లో మొత్తం 21,401 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 31 పోలింగ్ కేంద్రాల ద్వారా 16,498 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులలో మొత్తం 53,403 మంది ఓటర్లకు గాను 76 పోలింగ్ కేంద్రాల్లో 40,713 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. తద్వారా ఇక్కడ 76.24 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలో మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ వివరాలు
మున్సిపాలిటీ మహిళలు పురుషులు మొత్తంఓటర్లు ఓటేసింది పోలింగ్ శాతం
ఆమన్‌గల్ 8,509 8,475 16,984 14,403 84.8 శాతం
చేవెళ్ల 12,791 12,579 25,371 20,661 81.44 శాతం
మొయినాబాద్ 16,417 16,453 32,871 26,377 80.24 శాతం
ఇబ్రహీంపట్నం 13,252 12,741 25,993 20,392 78.45 శాతం
శంకర్‌పల్లి 10,850 10,551 21,401 16,498 77.09 శాతం
షాద్‌నగర్ 26,723 26,679 53,403 40,713 76.24 శాతం
మొత్తం 88,542 88,478 1,76,023 1,39,044 78.99 శాతం