మీది పగటి కల
మరో ఎనిమిదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన
ఎవరెన్ని కుట్రలు చేస్తారో చేయండి.. చూద్దాం
రంగారెడ్డికి గోదావరి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్‌కు రాలేదు
గోదావరి జలాలతో తాండూరు, వికారాబాద్ పరిగి ప్రజల కాళ్లు కడుగుతా
తాండూరులో కాగ్నా నీళ్లు పారిస్తా
వచ్చే మూడేళ్లలో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పూర్తి
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా వికారాబాద్
పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, వికారాబాద్ :
కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో రానీయకుండా మాజీ సీఎం కేసీఆర్.. మూడేళ్ల క్రితం విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా ఐదేళ్ల కోసం తాము అధికారంలో వచ్చామన్నారు. భవిష్యత్తులో ప్రజా ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. వచ్చే ఎనిమిదేళ్లూ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే కొనసాగుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలన తీరు. తనను విమర్శిస్తోన్న కేసీఆర్… కల్వకుంట్ల కిషన్ రావు(కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి) ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని సూచించారు. నువ్వు, నీ తాతలు ఎవరెవరు ఎన్నికల్లో అడ్డం వస్తారో రండి.. ఏ కుట్రలు చేస్తారో చేయండి.. చూద్దాం… అని సీఎం సవాల్ చేశారు. “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నామన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నించడం లేదని విమర్శించారు. కేటీఆర్‌కు ఇన్నాళ్లూ వికారాబాద్, తాండూర్ ఎందుకు గుర్తురాలేదు.? రంగారెడ్డికి గోదావరి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్‌కు ఎందుకు రాలేదని నిలదీశారు.

చంద్రబాబుకు సలహాలు తప్ప నీళ్లివ్వలేదు..
గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని వాటిని తరలించుకుపోవాలని కేసీఆర్.. నాడు చంద్రబాబుకు సలహాలు ఇచ్చారని సీఎం రేవంత్ ఆరోపించారు. 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్లప్పగించి చూసిన కేసీఆర్.. అందులో 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు ఇస్తే 30 లక్షల ఎకరాలకు సాగు నీరు వచ్చి ఉండేదన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఏం పాపం చేశారని గోదావరి జలాల సాధనలో నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ ను నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ. 38 వేల కోట్లతో నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పూనున్నారన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయిందన్నారు. దాంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్‌లు వచ్చాయని ఆరోపించారు. గోదావరి జలాల ముసుగులో రూ. వేలకోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు.

గోదావరి జలాలతో కాళ్లు కడుగుతా
గోదావరి జలాలతో తాండూరు, వికారాబాద్ పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ నీటితో ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడేళ్లలో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులతో పాటు అవసరమైన ప్రణాళికలకు రూపకల్పన చేస్తామన్నారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నది నీళ్లు ఇస్తామన్నారు. ఏడాది తిరిగేలోపు అప్పా జంక్షన్ నుంచి మన్నె గూడ, అక్కడి నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సబితా ఇంద్రారెడ్డికి అన్ని పదవులు ఇచ్చినా ఆమె పార్టీ ఫిరాయించారని సీఎం ఆరోపించారు. నాడు రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నానని చెప్పిన ఆమె.. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎందుకు నిధులు, అనుమతులు తీసుకురాలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చేసిన ద్రోహానికి ప్రజలను కలిసేందుకు సబితా ఇంద్రారెడ్డికి నైతిక హక్కు లేదని విమర్శించారు. పదేళ్లు కేసీఆర్, కేటీఆర్ మున్సిపాలిటీల వైపు చూడలేదన్నారు. తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లను పూర్తి చేస్తామన్న సీఎం.. రానున్న రోజుల్లో వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతోందని జోస్యం చెప్పారు. అనేక సమస్యలను అధిగమిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందనీ ప్రజలందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. తెలంగాణలో ప్రధానంగా రైతాంగం, నిరుద్యోగ యువత, మహిళలు ప్రాధాన్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి.. వాటిని వివరించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాలోని 6,650 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద రూ. 567.69 కోట్ల చెక్కును సీఎం.. మహిళా ప్రతినిధులకు అందజేశారు. ఈ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.