Take a fresh look at your lifestyle.

కౌమారదశ బాలికలకు ఆరోగ్య అవగాహన శిబిరం

  • ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహణ

బీబీనగర్, ముద్ర విలేకరి: కౌమార దశలోని బాలికలలో రుతు క్రమం, పరిశుభ్రత, పోషకాహారం, రక్త హీనత నివారణపై బుధవారం బీబీనగర్ లోని వలిగొండ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎయిమ్స్ వైద్యులు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికల వ్యక్తిగత ఆరోగ్య పద్ధతులను కూడా వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న “స్వస్త్ నారి, సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం కింద ఈ అవగాహన శిబిరం నిర్వహించారు. దాదాపుగా వంద మంది విద్యార్థినులు ఈ కార్యక్రమంలో వైద్యుల సూచనలు, సలహాలను తెలుసుకున్నారు. ఎయిమ్స్ నుంచి డాక్టర్ లక్ష్మీ జ్యోతి తడి, డాక్టర్ సిహెచ్ మధుసూదన్, నామా నాగమణి తదితరులు విద్యార్థినులతో రోల్ ప్లేలు, ఉపన్యాసాలతో ఈ అవగాహన శిబిరం నిర్వహించారు. రక్త హీనతపై చర్చతో పాటు, శానిటరీ ప్యాడ్ల వాడకం, పరిశుభ్రమైన పద్ధతులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి మాధవీలత, గురుకులం ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ భారతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులకు బోధనా సెషన్లు, రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ అవగాహన శిబిరంలో పాల్గొన్న విద్యార్థినులందరికీ పార్టిసిపేషన్ ధ్రువపత్రాలతో పాటు అందరికీ శానిటరీ ప్యాడ్లు అందించారు.

Leave A Reply

Your email address will not be published.