Take a fresh look at your lifestyle.

రైతు బంధు నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం తక్షణమే నిధుల విడుదల, ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు ఆదేశం

ముద్ర ప్రతినిధి మెదక్:
రైతులకు రావాల్సిన రైతు బంధు ప్రయోజనాలను నిలిపివేయడంపై రాష్ట్ర హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పిటిషనర్ల భూములు 8 ఎకరాలు 32 గుంటలు ఉండగా, సివిల్ కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్‌ను ఆధారంగా తీసుకొని అధికారులు రైతు బంధు ప్రయోజనాలను నిలిపివేశారు. అయితే ఆ ఇంజక్షన్ కేవలం భూమిని విక్రయించకూడదు లేదా బదిలీ చేయకూడదనే పరిమితి మాత్రమే విధించిందని, రైతు సంక్షేమ పథకాలను నిలిపివేయడానికి అది కారణం కాలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుగా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్‌లను పిటిషనర్లకు రావాల్సిన రైతు బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్ల భూమిలో పండించిన ధాన్యాన్ని ఇందిరా కిసాన్ పథకం కింద కొనుగోలు చేయడానికి అనుమతించాలని కూడా స్పష్టం చేసింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎల్. ప్రీతమ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉన్నా రైతు బంధు నిలిపివేయడం చట్టబద్ధం కాదని, రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై ప్రతివాదికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, కేసును తదుపరి విచారణకు జూన్‌ 16కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.