-
గోవిందపురంలో ఎయిమ్స్ వైద్య శిబిరం
బీబీనగర్, ముద్ర విలేకరి: ఎర్ర రక్తకణాలకు సంబంధించిన సికిల్ సెల్ రక్తహీనతపై బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), బొమ్మలరామారంలోని ప్రాంతీయ వైద్యశాల సంయుక్తంగా గిరిజన గ్రామం గోవిందతండాలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించాయి. ఎయిమ్స్ లోని కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పాథాలజీ విభాగం వైద్యులు ఈ శిబిరానికి మార్గదర్శనం వహించారు. మహిళల ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేయడానికి వీలుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన “స్వస్త్ నారీ శక్తి పరివార్ అభియాన్” పథకం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా భారతదేశంలోని గిరిజన సమూహాలలో ఈ సికిల్ సెల్ డిసీజ్ (ఎస్ సీడీ) ప్రబలంగా వున్నట్టు కేంద్ర వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యాధిపై వారిలో పరిపూర్ణ అవగాహన లేకపోవడం, సరైన వైద్య ఆరోగ్య వసతులకు దూరంగా ఉండడం వల్ల సరైన చికిత్స అందక ఈ వ్యాధి గ్రస్థులు మరణిస్తున్నారని ఆయా నివేదికలు చెబుతున్నాయి. ఈ కారణంగా గిరిజనుల్లో ఈ వ్యాధిపట్ల అవగాహన కల్పించడానికి వీలుగా గోవిందతండాలో గురువారం ఈ శిబిరాన్ని నిర్వహించారు.
వంశపారంపర్యంగా సంక్రమించే ఈ వ్యాధిపట్ల గిరిజనుల్లో పరిపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంతా సింగ్, డాక్టర్ అభిషేక్ అరోరా, డాక్టర్ నీరజ్ అగర్వాల్ సహకరించారు. బొమ్మలరామారంలోని ప్రాంతీయ వైద్యశాల ఇన్ ఛార్జి, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ కే గోవిందరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పరాగ్ పాటిల్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. డాక్టర్ అలేఖ్య, డాక్టర్ అఖిల్ లతో పాటు పలువురు నర్సింగ్ ఆఫీసర్ల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు బాలింతలు, వృద్ధ మహిళలు, గ్రామస్థులు హాజరయ్యారు. వచ్చిన వారంతరికీ రక్తపోటుతో పాటు ఆర్ బీఎస్, సీబీపీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ కు చెందిన పలువురు వైద్య అధికారులు, జూనియర్, సీనియర్ రెసిడెంట్లు హాజరయ్యారు.