ఎస్.ఎల్.బి.సి పునరుద్దరణ పనులు వేగవంతం: భద్రతపై ప్రత్యేక దృష్టి – ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే దేవరకొండ భాగంలోని ఔట్ లెట్ సొరంగ మార్గం తవ్వకం 20 మీటర్ల మేర పూర్తి అయ్యిందన్నారు. ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ పనుల పురోగతిపై శనివారం మంత్రి రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి ఇన్ లెట్ సొరంగ మార్గం పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారని ఆయన వెల్లడించారు. సొరంగ మార్గం తవ్వకాలలో భద్రతా చర్యలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. తవ్వకాల సమయంలో అవసరమైన గాలి ప్రసరణతో పాటు సొరంగ మార్గం తవ్వేటపుడు వచ్చే నీటిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూభౌతిక పరిస్థితిలకనుగుణంగా టన్నెల్ బోర్ మిషన్ (టి.బి.యం) విధానాన్ని విరమించుకుని అత్యాధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సురక్షిత మార్గాలు అన్వేషించి అదనంగా వెంటిలేషన్,విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకున్నట్లు వివరించారు. గతేడాది ఫిబ్రవరి నెలలో ఎస్.ఎల్.బి.సి తవ్వకాలలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాద ఘాటనను దృష్టిలో పెట్టుకొని అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 జూన్ నాటికి ఎస్.ఎల్.బి.సి ని పూర్తి చేసేందుకు రూపొంచిన ప్రణాళికలననుసరించి 24 గంటలు మూడు షిఫ్ట్ లలో పనులు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో సొరంగ మార్గం-1,సొరంగ మార్గం 2 లలో తవ్వకాలకు సంబంధించిన ఏర్పట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో సమీక్షించారు. నిర్ణిత గడువు లోపు పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.