ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్‌తో కలిసి ఆయన హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 44 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి వచ్చిన పెండింగ్ అర్జీలను కూడా వారంలోపు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.