సీఎం రేవంత్ ది ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను విడుదీసే కుట్ర
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే సీఎం వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటేనే ద్వేషం అన్న కేంద్రమంత్రి అందుకే 50 ఏళ్ల పాలనలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కాపీలను చింపిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలతో అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని బండి సంజయ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచితే దక్షిణాదికి జరిగే నష్టమేంటని బండి సంజయ్ నిలదీశారు. ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లను పెంచితే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలి కాచుకుంటారని ప్రశ్నించారు. మీలో దేశభక్తి, జాతీయవాదం మచ్చుకైనా కన్పించవా అని ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణుకు సీఎంలో మొదలైందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా అక్కడ కాంగ్రెస్ పాచికలు పారడం లేదని అర్థమైందని, అందుకే దక్షిణాదికి అన్యాయం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. త్వరలోనే తమిళనాడు, కేరళ ప్రజలు కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలకు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.