Take a fresh look at your lifestyle.

ఇంధన మంట………. హైదరాబాద్ అతలాకుతలం

అసలు పెట్రోల్ కొరత ఉందా?
బంకులు ఎందుకు మూతపడుతున్నాయి?
కొరత లేదంటూ పౌరసరఫరాల శాఖ క్లారిటీ
అత్యవసరంగా సీఎం సమీక్ష
బంకుల ముందు వాహనాల బారులు
ఇంకా తెగని లొల్లి

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్లు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. డిమాండ్‌కు సరఫరా చమురు లభ్యత లేకపోటవంతో చాలా దేశాల్లో వంట గ్యాస్‌తో పాటు ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పుడి సెగ హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. నగరంలో పెట్రోల్, డీజిల్‌ లభ్యతపై ఆందోళన నెలకొంది. జనం బంకుల ముందు బారులు తీరుతున్నారు. దానికి కారణం స్టాకు అయిపోయి కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు మూతపడటం. గత రెండు రోజులుగా నగరంలోని పలు చోట్ల పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ఆయిల్ కంపెనీలు ముందుగా నగదు చెల్లిస్తేనే స్టాక్ అనే కొత్త నిబంధన తేవడంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాత అప్పులు తీర్చి, కొత్త స్టాక్‌కు ముందే డబ్బు కట్టలేక పలు బంకులు మూతపడ్డాయి. దీంతో తెరిచి ఉన్న బంకుల వద్ద జనం బారులు తీరడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, చెల్లింపు విధానాల మార్పు వల్ల తలెత్తిన తాత్కాలిక సమస్యేనని ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. గతంలో ఆయిల్‌ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే తొలుత డీజిల్, పెట్రోల్‌ బంకులకు సరఫరా చేసేవి. స్టాక్ సేల్ అయ్యాక ఒకటి రెండు రోజుల తర్వాత బంకుల యజమానులు ఆయిల్‌ సంస్థలకు తిరిగి డబ్బులు చెల్లించేవారు. కానీ మూడు నాలుగు రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంత ఇంధనం కావాలంటే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని ఆయిల్‌ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నగరంలో పలు బంకులకు సరఫరా నిలిచిపోయింది. పాతబకాయిలు వెంటనే చెల్లించాలని కొత్తగా స్టాక్‌కు డబ్బులు ముందే చెల్లించాలని ఆయిల్ సంస్థలు చెబుతుండడంతో నగరంలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్‌ ఉన్న బంకులపై ఒత్తిడి పెరిగి ఒక్క రోజులోనే స్టాకు అయిపోతోంది. మళ్లీ స్టాకు వచ్చేవరకు ఆయా బంకులు మూతపడుతున్నాయి.

ఇది ఉద్దేశ్యపూర్వకమే
కాగా, ఆయిల్‌ కంపెనీలు ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కొత్తగా మార్పులు తీసుకురావటం సరైందికాదని అంటున్నారు. ఆయిల్‌ కంపెనీలు, పెట్రోల్‌ బంకులు మధ్య ఏర్పడిన వివాదంతో హైదరాబాద్ నగరంలో పెట్రోలు బంకులు మూతపడుతున్నా పౌరసరఫరాలశాఖ చోద్యం చూస్తోందని బంకుల యజమానులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప కావాల్సిన చర్యలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ కొరత లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. డిపోలలో తగినంత ఇంధనం ఉందని అంటున్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురై తమ వాహనాలను ఫుల్ ట్యాంకులు చేసుకునేందుకు ఎగబడటం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల బంకు యజమానులకు తాత్కాలిక సమస్య ఏర్పడిందని చెబుతున్నారు.

హైదరాబాద్ ఆగమాగం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం పెట్రోలు బంకుల వద్ద వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మంగళవారం పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఆందోళనకు గురైన వాహనదారులు తమ ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు బంకుల వద్దకు పోటెత్తారు. కూకట్‌పల్లి, ప్రగతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట, సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్ వంటి ప్రధాన జంక్షన్లలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయింది. దీంతో యాజమాన్యాలు ‘నో స్టాక్’ బోర్డులు ప్రదర్శించడంతో వాహనదారుల్లో మరింత ఆందోళన నెలకొంది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడటం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. చాలా మంది వినియోగదారులు ముందస్తు జాగ్రత్తగా క్యాన్లలో కూడా ఇంధనాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ పరిస్థితిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ కీలక విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులు మాత్రమేనని, నగరంలో ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద అనవసరంగా గుమిగూడటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఇతర అధికారులు కూడా తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

పలుచోట్ల పెట్రోల్, ఎల్పీజీ కొరత
నగరవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఉప్పల్, మల్లాపూర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు అకస్మాత్తుగా మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ఇది నిజమైన కొరతనా లేక ధరలు పెరుగుతాయన్న ఆశతో యజమానులు సృష్టిస్తున్న కృత్రిమ కొరతనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి బంకుల్లో తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఎల్‌పీజీ గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతం. లక్డీకాపూల్ వంటి రద్దీ ప్రాంతాల్లో వందలాది ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గంటల తరబడి నిరీక్షణతో ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతినడమే కాకుండా, ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. యుద్ధం కారణంగా సరఫరా దెబ్బతిందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో తలెత్తిన ఈ ఇంధన సంక్షోభం సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఖైరతాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌తో పలు చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడం వాహనదారుల్లో ఆందోళన నింపింది. మరోవైపు, లక్డీకాపూల్ వంటి ప్రాంతాల్లో ఎల్‌పీజీ గ్యాస్ కోసం వందలాది ఆటోలు గంటల తరబడి వేచి చూడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఇంధన కొరత వదంతుల వల్ల సామాన్యుల జనజీవనం, ఆటో కార్మికుల ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

పౌరసరఫరాల శాఖ క్లారిటీ
గత కొన్ని రోజుల నుంచి పలు పెట్రోల్, ఎల్పీజీ బంకులలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉంటున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందని మంగళవారం నాడు హైదరాబాద్‌లో పలు పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి చూపించేలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పందించి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంట గ్యాస్ నిల్వలకు ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనలకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని, దీనివల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. రిఫైనరీల నుండి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి అకస్మాత్తుగా పెట్రోల్ బంకులకు వెళ్లి కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఫుల్ స్టాక్.. డీలర్స్ అసోసియేషన్
తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా ఈ విషయంపై స్పందించింది. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని తేల్చి చెప్పింది. హెచ్‌పీసీఎల్ (HPCL), ఐవోసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థల వద్ద తగినంత స్టాక్ ఉందని తెలిపింది. కస్టమర్ల ముందస్తు కొనుగోళ్ల వల్లే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇంధన కొరత లేదని పేర్కొంది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు సంయమనం పాటించాలని.. అవసరానికి తగ్గట్లుగా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలని అసోసియేషన్ కోరింది.

మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలో ఇంధన కొరత ఉందని ప్రచారం జరగడం, పలు పెట్రోల్ బంకులు, ఎల్పీజీ వద్ద ఇంధనం కోసం బైకులు, ఆటోలు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంధనం, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో అధికారులతో భేటీ అయి ఇంధన సరఫరా నిల్వలపై చర్చించనున్నారు. సరఫరా పెంచడంతో పాటు కొరత అంటూ వదంతులను అరికట్టడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. మరోవైపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సైతం ఇంధన కొరత లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజలు వదంతులను నమ్మి ట్యాంక్ ఫుల్ చేయించేందుకు పెట్రోల్ బంకులకు ఒక్కసారిగా పోటెత్తకూడదని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.