Take a fresh look at your lifestyle.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను సమన్వయంతో విజయవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సమన్వయంతో సక్సెస్ చేయండి
హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు
అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలి
శాఖల వారీగా చేపట్టే అంశాలపై సమీక్ష నిర్వహణ

ముద్ర, హైదరాబాద్ :

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో కలిసి విజయవంత చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. 99 రోజుల ప్రణాళిక లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం, అన్ని వర్గాల ఆరోగ్యం, ఉద్యోగులు, విద్యార్ధలు, మహిళలు సురక్షితంగా తమ ఇండ్లకు చేరుకోవడం, సంక్షేమం, పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్కు నో, విద్య, యువత, క్రీడలు, మహిళలు పర్యావరణం అనే పది ప్రధాన అంశాలు ఉన్నాయని చెప్పారు.

 

వీటన్నింటినీ 99 రోజుల్లో సంబంధిత శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు వివరించారు. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో మార్చి 6 నుండి జూన్12 వరకు జరగనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో శాఖల వారిగా చేపట్టవలసిన అంశాలపై పొన్నం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్క ప్రధాన అంశంపై ఆ శాఖకు సంబంధించిన ఉన్నత అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ మార్చి 26 నుండి మార్చి 15 వరకు చేపట్టనున్నట్లు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యం కు సంబంధించి ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు, పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో సురక్షితంగా ఇంటికి చేరుకోండి కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు చేపట్టనున్నట్లు తెలిపారు. సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సంక్షేమం కు సంబంధించి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లల భద్రత రక్షణ, డ్రగ్స్కును కార్యక్రమాన్ని ఏప్రిల్ 27 నుండి మే రెండు వరకు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ ,విద్యుత్ సమస్యలకు సంబంధించి మే 4 నుండి మే 9 వరకు కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యకు సంబంధించి మే 11 నుండి మే16 వరకు పలు కార్యక్రమాలు, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువత, క్రీడలకు సంబంధించి మే 18 నుండి మే 22 వరకు యువజన క్రీడలు, సర్ఫ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మెప్మా ఆధ్వర్యంలో మహిళలు అంశంపై మే 25 నుండి మే 30 వరకు కార్యక్రమాలు,పర్యావరణం అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణం అనే అంశంపై జూన్ 1 నుండి జూన్ 12 వరకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. చేపట్టే ప్రతిచోట కూడా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని అధికారులు బాధ్యతాయుతంగా సమన్వయంతో కలిసి పని చేయాలని మంత్రి సూచించారు. కార్డులు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్లుప్తంగా వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో జిల్లా మంత్రుల సన్నాహక సభలు జరుగుతాయని, మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ సొసైటీ చైర్మన్ లనూ ఆహ్వానించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మానిటర్ చేయడానికి సిజిజి ద్వారా ఒక మొబైల్ యాప్ కూడా తయారు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. నేడు హైదరాబాద్ జిల్లాలో ఈ – వ్యర్థాల సేకరణ సెంటర్ ను ప్రారంభించుకున్నామన్నారు. విద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతీస్తుందని పాఠశాలలో పిల్లల డ్రాప్స్ లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సంబంధిత అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రేషన్ కార్డులు,సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.వివిధ అంశాలపై అధికారులకు పిర్యాదులు అందితే వారం రోజుల్లోపు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పోలీస్ కమిషనర్ సజ్జనార్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, ఎస్ పి డి సి ఎల్ ఎం డి జితేష్ పాటిల్, జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, డిసిపి శిల్పవల్లి, అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, డిఆర్ఓ వెంకటాచారి, ఆర్డీవోలు రామకృష్ణ సాయిరాం, జిల్లా అధికారులు, తాహసిల్దార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.