- రంగగిరి సన్నిధిలో అద్భుత ఘట్టం
ముద్ర న్యూస్ బ్యూరోహైదరాబాద్: మౌలాలిలోని శ్రీ రంగగిరి సన్నిధిలో ఆదివారం నాడు ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వందల గొంతుకలొక్కటై ‘శ్రీమన్నారాయణీయమ్’ స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా, శృతిబద్ధంగా, తన్మయత్వంతో పఠిస్తుంటే – కోవెల ప్రాంగణమంతా ఏవో దివ్య ప్రకంపనలు ఆవరించిన అనుభూతి కలిగింది.
అశేషసంఖ్యలో ‘అగ్రేపశ్యామి’ బృంద సభ్యులు శ్రీమతి సారిక గారి నేతృత్వంలో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
శ్రీమద్భావత సారభూతమై, మేల్పుత్తూర్ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన ‘శ్రీమన్నారాయణీయం’ అత్యంత మహిమాన్వితమైనది. ఆరోగ్యప్రదాయకమైనది.తిరుప్పావై మహోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం విశేషం.
దాదాపు నాలుగు గంటలకు పైగా ఈ పారాయణం జరిగింది.అంతకుముందు ప్రభాత వేళలో తిరుప్పావై శేవాకాలం తర్వాత గోదామాత పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది… ఈ పల్లకీ ఊరేగింపులో ఇవాళ భగవద్రామానుజుల తిరుమూర్తిని కూడా ఊరేగించడం విశేషం…ఆండాళ్ తల్లికి అనుజుడిగా చెప్పే రామానుజులు – ఇవాళ సోదరి వెంట ఊరేగడం చూసి భక్తులు అమితానందానికి లోనయ్యారు…స్తోత్రపారాయణం తర్వాత స్వామికి నివేదించిన ఘుమఘుమల కదంబ ప్రసాదాన్ని, దధ్యోదనాన్ని అందరికీ వితరణ చేశారు.
ఆదివారం తిరుప్పావై అనుసంధించే సమయంలో బిజెపి సీనియర్ కేంద్ర నాయకులు మురళీధరరావు, కార్యక్రమం ఆసాంతం పాల్గొని అమ్మవారి పల్లకీ సేవ మోశారు.పారాయణం ముగిసాక మధ్యాహ్నం ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారు లక్ష్మారెడ్డి , స్థానిక కార్పోరేటర్లు స్వామిని సందర్శించుకున్నారు.