ముద్ర కూకట్‌పల్లి :
రాజ్యాంగ 131వ సవరణ (మహిళా బిల్లు) పార్లమెంట్‌లో వీగిపోవడం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి ఇన్‌ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. విపక్షాలపై ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని బీజేపీ నాటకమాడుతోందని, ఓటమి భయంతోనే విపక్షాలపై శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. 543 పార్లమెంట్ స్థానాలకు మహిళా రిజర్వేషన్ వర్తింపజేస్తూ వెంటనే బిల్లు ప్రవేశపెడితే ఏకగ్రీవంగా మద్దతిస్తామని, 2011 జనాభా లెక్కల కాకుండా తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ కోరుతోందని స్పష్టం చేశారు.నారీ శక్తి’ పేరిట డిలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించి, ఉత్తరాది అండతో ఎప్పటికీ అధికారంలో ఉండాలనేది కేంద్రం కుట్రని ఆరోపించారు.ఈ కుట్రను పసిగట్టి దేశంలోని ఇతర పార్టీలను జాగృతం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సఫలీకృతులయ్యారని కొనియాడారు.బీజేపీకి మహిళలపై నిజమైన ప్రేమ ఉంటే, రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచే 543 స్థానాల్లో రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహిళా సాధికారత కోసం ఎటువంటి నిబంధనలు లేని మెరుగైన బిల్లును ప్రవేశపెడుతుందని బండి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.