- వైద్య కాలేజీలు ఇవేనా..?
- మెడికల్ కాలేజీలపై ఎన్ఎంసీ అసహనం
- మౌలిక సదుపాయాలు లేవంటూ తనిఖీలు చేసిన నేషనల్ మెడికల్ కమిషన్
- సిబ్బంది కూడా లేరు.. క్లినికల్ మానిటరింగ్ లోపాలు
- 90 శాతం వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నోటీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మెడికల్ విద్య విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా జారీ చేసిన షోకాజ్ నోటీసులతో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో ఉన్న 61 మెడికల్ కాలేజీలలో 90 శాతం కాలేజీలకు నోటీసులు అందాయి.మౌలిక సదుపాయాల లోపాలు, సిబ్బంది కొరత, అకడమిక్ నిర్వహణలో వైఫల్యాలపై ఎన్ఎంసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, కాలేజీలు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది.మొత్తం 61 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.అయితే, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఇటీవల 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనేక ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తంగా 52 వైద్య కళాశాలలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.
రాష్ట్రంంలో ‘జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ’ లక్ష్యంతో గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. 2024 నాటికి 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నెలకొల్పింది. అదే సమయంలో 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పనిచేస్తున్నాయి.అంతకు ముందు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.రాష్ట్రం మెడికల్ విద్యా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతూ.. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఈ కాలేజీలను మొదలుపెట్టారు.రాష్ట్రంలో స్థాపించబడిన మొదటి మెడికల్ కాలేజీల్లో 1846లో హైదరాబాద్‌లో స్థాపించిన ఉస్మానియా మెడికల్ కాలేజీ’.ఇది భారతదేశంలో పురాతనమైన మెడికల్ కాలేజీలలో ఒకటిగా నిలిచింది. 2024–-25 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ కాలేజీలు ములుగు, నర్సంపేట్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో స్థాపించబడ్డాయి.ప్రతి కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, మొత్తం 400 సీట్లు పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కలుపుకుని.. రాష్ట్రంలో మొత్తం 8,490 సీట్లు ఉన్నాయి.
- సరిగా లేవు.
తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ 90 శాతం మెడికల్ కాలేజీలకు నోటీసులు జారీ చేయగా ఈ నోటీసుల్లో మౌలిక సదుపాయాల లోపాలు, సిబ్బంది కొరత, క్లినికల్ మానిటరింగ్ లోపాలు, హాస్టల్ నిర్వహణ సమస్యలు వంటి అంశాలను వివరించింది.మెయింటెనెన్స్, పాఠ్య ప్రణాళికలను సరైన ప్రమాణాలతో అమలు చేయకపోవడమే ప్రధాన కారణంగా పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు ప్రకారం ప్రతి ఏటా ఒక్కో మెడికల్ కాలేజీ తమ పూర్తి స్థాయి డేటాను ఏడీఆర్ రిపోర్టు పేరిట ఎన్ ఎంసీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంతకంటే ముందే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హెచ్ ఎంఐఎస్ పోర్టల్ లోనూ ఆయా కాలేజీల వివరాలు సమర్పించాలి.ఏడీఆర్ రిపోర్టు, హెచ్ ఎంఐఎస్ పోర్టల్ వివరాలు తప్పనిసరిగా ట్యాలీ అవ్వాలి.కానీ ఈసారి ఓపీ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు వివరాలేవీ సరిగ్గా లేవని ఎన్ ఎంసీ గుర్తించింది. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక వారం రోజుల్లో మెడికల్ కాలేజీలు ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే భారీగా పెనాల్టీలు కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. గతంలోనూ కొన్ని ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు పెనాల్టీలు కట్టిన సందర్భాలు ఉన్నాయి.అయితే, గతంలో ఒకటి రెండు కాలేజీలు కట్టగా, ఈ సారి మాత్రం భారీగా షోకాజ్ నోటీసులు అందాయి.మరోవైపు ఆరోగ్యరంగంలో తమిళనాడు దేశంలోనే టాప్ లో ఉంటుందని ప్రచారం ఉన్నది.అన్ని సంస్థలు, రీసెర్చ్ లు కూడా ఇదే సూచిస్తున్నాయి. కానీ, తమిళనాడులో 36ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఏకంగా 34 కాలేజీలకు ఎన్ ఎంసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరం. తమిళనాడు కాలేజీలకే నోటీసులు వచ్చాయంటే మన దగ్గర ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితిని ఊహించుకోవచ్చని అంటున్నారు.
ఈ షోకాజ్ నోటీసుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మెడికల్ విద్య నాణ్యతపై సంశయాలు తలెత్తుతున్నాయి.కాలేజీలు త్వరగా చర్యలు తీసుకుని ఎన్ఎంసీకి తగిన నివేదికలు సమర్పిస్తే గానీ.. అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశముంది. విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ సమస్యలను వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలు, మెయింటనెన్స్ సరిగ్గా లేవంటూ ఎన్ ఎంసీ మెయిల్ లో మెన్షన్ చేసింది.ఇక ఎంఆర్ ఐ, సిటీ స్కాన్లు పనితీరుతో పాటు ఇతర డయాగ్నస్టిక్ సేవలు వెరీ పూర్ ఉన్నట్లు పేర్కొన్నది. సర్జరీల్లో జాప్యం, సక్సెస్ రేట్ లేకపోవడం వంటి సమస్యలను ఎన్ ఎంసీ ఆయా షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నది. ఇక ప్రొఫెసర్ల కొరత, నాన్ టీచింగ్ స్టాఫ్, అబాస్ అడెండెన్స్ వైఫల్యం తదితర సమస్యలన్నింటినీ వివరిస్తూ షోకాజ్ నోటీసులో పొందుపరిచింది. వీటిపై కేవలం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎన్ ఎంసీ స్పష్టం చేసింది.