- తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.
- సీఎం అహంకారానికి ఇది నిదర్శనం.
- మన దేశ పోరాటం పాకిస్తాన్ ఆర్మీపై కాదు – ఉగ్రవాదులపైనే.
- ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు.
- తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా కల్చరల్, స్పిరిచువల్ టూర్‌లో పాల్గొనేందుకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. మహిళల ధైర్య సహాసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరమని అన్నారు. సమ్మక్క సారాలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత అవమానం జరిగిందన్నారు.ఈమేరకు గురువారం నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు.. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్ళు కడిగించారన్నారు.‘అతిథి దేవో భవ’ మన విధానమని, కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదన్నారు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, దానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఇందుకుగానూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.