Take a fresh look at your lifestyle.

మూసీ రివర్స్ ఫ్రంట్ పనులకు బ్రేక్ ?

మూసీ ఒడ్డున భారీగా చెట్ల నరికివేతను అడ్డుకోండి
ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన న్యాయవాది రామారావు
జాతీయ మానవ హక్కుల కమిషన్‍లో కేసు నమోదు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా.. మూసీ నది ఒడ్డున భారీగా చెట్లను నరికివేస్తున్నారంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామరావు ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ)ను ఆశ్రయించారు. ఆ ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‍లో రామారావు కేసు నమోదు చేశారు. మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి.. ఆ నది చుట్టుపక్కల పర్యావరణ విధ్వంసం జరుగుతోందని.. దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పరివాహకంలో ఉన్న లంగర్ హౌస్, నార్సింగి, రాందేవ్‌గూడ ప్రాంతాల్లో ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండానే.. ఎప్పటి నుంచో ఉన్న వేలాది మహా వృక్షాలను నరికేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. చెట్లను తొలగించడంతో పర్యావరణ, సామాజిక ప్రభావంపై ఎలాంటి సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేపట్టకుండానే ప్రభుత్వం పనులు ప్రారంభించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మూసీ నది తీరాన్ని తీవ్రంగా ధ్వంసం చేస్తున్నారని.. దాని వల్ల ప్రజల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని.. ప్రాజెక్ట్ అమలు సంస్థ అయిన మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహా రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని లాయర్ ఇమ్మనేని రామారావు కోరారు. అదే సమయంలో పర్యావరణానికి హాని చేసే పనులను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కారణంగా ప్రభావితం అయ్యే కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని పేర్కొన్నారు. లాయర్ ఇమ్మనేని రామారావు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్ హెచ్ ఆర్సీ.. కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టింది. విచారణ పూర్తయ్యే వరకు పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది.‌ పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్న ఇమ్మనేని రామారావు.. మూసీ తీరాన్ని రక్షించేందుకు చట్టపరంగా తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
మరోవైపు.. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాలను బలవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని.. ఇప్పటికే స్థానికులు, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మూసీ ఒడ్డున భారీ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం దాని కోసం భారీగా అక్కడ భారీగా ఇండ్లు, నిర్మాణాల కూల్చివేతలకు దిగిందన జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఈ అంశం తెరపైకి వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.