ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తప్పవని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారికి జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమే కాకుండా ప్రాణాపాయకర చర్య అని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు చాలా తీవ్రమైనవని, అలాంటి ఘటనల్లో ప్రాణ నష్టం, శాశ్వత గాయాలు కలగవచ్చని వివరించారు. వేగ పరిమితులు పాటించడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి ప్రాథమిక రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో తల్లితండ్రులదే బాధ్యత అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు టౌన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఆర్ఐ రామ్ నిరంజన్ రావు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు, మైనర్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.