Take a fresh look at your lifestyle.

జగిత్యాల నుంచి బిఆర్ఎస్ జైత్రయాత్ర…

రెండున్నర ఏళ్లలో సీఎంకు మేడిగడ్డకు పోవడానికి టైం లేదు…
రేవంత్ రెడ్డి హైటే కాదు… బుర్ర కూడా తక్కువే… కేటీఆర్
రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి… హరీష్ రావు
రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై హరీశ్ రావు సెటైర్లు..
తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్ రావు..
జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్, హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల నుంచి బిఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచి బిఆర్ఎస్ పునర్వైభవం ప్రారంభమై మళ్లీ సీఎం గా కేసీఆర్ కానున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు తో కేటీఆర్ కలిసి జగిత్యాల లోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి శనివారం వెళ్లి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మినీ స్టేడియంలో ఈనెల 20న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు లు మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేగీకరణ జరుగుతుందని, సింహం బయటకు వస్తే గుంటనక్కలకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. జగిత్యాల సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఈ సభ జరిగే తీరుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గత రెండున్నర ఏళ్లలో మేడిగడ్డకు పోయేందుకు టైం లేదు కానీ, జగిత్యాలకు కేసీఆర్ వస్తుంటే మాత్రం అదే రోజు సీఎం మేడిగడ్డకు వెళ్లడం వారి చిల్లర ప్రయత్నం, కుసంస్కారానికి నిదర్శనం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైటే తక్కువ అనుకున్నాం కానీ బుర్ర కూడా తక్కువగానే ఉందని ఆయన విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైబ్రిడో, ఏ బ్రీడో తెలియదని, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి… హరీష్ రావు

రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసిందని రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అనడానికి జీవన్ రెడ్డి చేరిక ఒక సజీవ సాక్ష్యం అని మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. రాజకీయ విలువలున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుతుందని, జీవన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. డీలిమిటేషన్‍పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం ఏంటో ఇవాళ స్పష్టమైందని అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని సెటైర్ వేశారు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో అని ఎద్దేవా చేశారు. బడే భాయ్‍కి భయపడే తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కనీసం స్పందించలేదన్నారు.

మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటులో కొట్లాడినట్లు నాటకాలు ఆడుతూ మహిళలకు తీరని ద్రోహం చేశాయని మహిళా బిల్లుకు నిజంగా చట్టబద్ధత కల్పించాలనుకుంటే దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారని ప్రశ్నించారు. బీజేపీకి పార్లమెంటులో 2/3 మెజార్టీ లేదని, 68 సీట్లు తక్కువ ఉన్నాయని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం రాజకీయాల కోసమే, ఎటువంటి చిత్తశుద్ధి లేకుండానే మహిళా బిల్లును తీసుకొచ్చారన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏనాడో నిరూపితమైందని కేసీఆర్ నాయకత్వంలో మొదటి తెలంగాణ శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత మా పార్టీదేనన్నారు. పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయని హరీశ్ రావు అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమేనన్నారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయని కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? అని నిలదీశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు పాసై, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. నిన్నటి లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని మన ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లం అన్నారు.మన రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా పెదవులు మూసుకొని మౌనంగా కూర్చున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్ ఛోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైందని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లారని విమర్శించారు. కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా? అని నిలదీసారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు, మాజీ మంత్రులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.