Take a fresh look at your lifestyle.

ఆగిన బస్సు చక్రం బస్సులు నడిపేందుకు యత్నం… అడ్డుకున్న కార్మికులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుండి కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులుపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ ఆర్టీసీ డిపో వద్ద తెల్లవారుజామున జేఏసి నేతలతో కలిసి కార్మికులు పెద్ద ఎత్తున బైఠాయించారు. పోలీసులను పెద్ద ఎత్తున బందోబస్తు మోహరించారు. మెదక్ ఆర్టీసీ డిపోలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బస్సులను డిపోల నుండి బయటకు వెళ్లనివ్వకుండా కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని నినాదాలు చేశారు. బస్సులు కదిలించే యత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు. ఒకదశలో అడ్డం పడుకున్నారు. టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు లాగేశారు.
అయితే కార్మికుల సమ్మెతో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. సమ్మె ప్రభావంతో బస్సులు నిలిచిపోవడం వలన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై దృష్టి సారించింది. అద్దె బస్సులను నడిపించడంతో పాటు తాత్కాలికంగా కండక్టర్ల నియామకానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయా డిపో మేనేజర్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 30 శాతం ఫిట్మెంట్, వేతన బకాయిల చెల్లింపు చేయాలన్నారు. పీఎఫ్, సీసీఎస్ కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. యూనియన్ల పునరుద్ధరణ చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు వినతి పత్రాలను అందించినా స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.