Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులు జరుగుతున్నాయనే ఆనవాళ్లే కనిపించడం లేదు-కోస్గి పట్టణ సమగ్రాభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

 

అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం

అభివృద్ధి పనులు ఆగకుండా తగిన చర్యలు తీసుకోవాలి

 

ముద్ర, నారాయణ పేట :

కోస్గి పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆనవాళ్లే కనిపించడం లేదని కలెక్టర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని కోస్గి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముందుగా పట్టణంలో నిర్మిస్తున్న సైన్స్ మ్యూజియం పనులను చూశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పక్కనే ఉన్న మున్సిపల్ పార్కును పరిశీలించారు. బస్టాండ్ మలుపు దారి వద్ద జంక్షన్ ఏర్పాటు కోసం అధికారులకు సూచనలు చేశారు. అలాగే రూ.10.50 కోట్లతో కోస్గి పట్టణ డంపింగ్ యార్డ్ కు సీసీ రోడ్ల నిర్మాణ పనులు, ప్రహరీ నిర్మాణ పనులను డంపింగ్ యార్డుకు వెళ్లి పరిశీలించారు. డంపింగ్ యార్డులో చెత్తాచెదారానికి నిప్పు ఎందుకు పెట్టారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పట్టణంలో మందకొడిగా సాగుతున్నాయని, నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి కోస్గి పట్టణ సమగ్ర అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు కాగా ఆ నిధులతో పట్టణంలో అభివృద్ధి పనుల ప్రస్తుత పరిస్థితినీ అధికారులతో కలెక్టర్ గంటన్నర పాటు చర్చించారు. అభివృద్ధి పనులు ఎక్కడా ఆగిపోకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న మిగతా పనులను నిర్ణీత గడువు లోపే పూర్తి చేయించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కడ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే కోస్గి పట్టణంలోని 7వ వార్డులో ఏర్పాటు చేసిన పట్టణ సభకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను అందజేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.