Take a fresh look at your lifestyle.

ఆధునిక పద్ధతులతో లాభదాయక పంటల సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రతతో పత్తి సాగు చేస్తే మెరుగైన దిగుబడితో పాటు మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు.

శనివారం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా, పంట ప్రదర్శన మరియు అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పాత పద్ధతులకు పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లాలో రైతులు ఎక్కువగా వరి సాగుపైనే ఆధారపడుతున్నారని, దీనివల్ల ఆశించిన ఆదాయం రాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. రైతులు తమ భూమిలో కొంత భాగంలో వరి సాగు చేసి, మిగతా భూమిలో పంట మార్పిడి ద్వారా కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటి పంటలు సాగు చేయాలని సూచించారు.

అధిక సాంద్రత పత్తి సాగుతో ఎకరానికి సుమారు 25 వేల మొక్కలు నాటవచ్చని, తక్కువ కాలంలో పంట చేతికి అందుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఈ పద్ధతిని అనుసరిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు.

అలాగే ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని, ఎకరాకు రూ.51 వేల వరకు మొక్కలు, డ్రిప్, నిర్వహణ ఖర్చుల కోసం సహాయం అందిస్తోందని చెప్పారు. మూడు సంవత్సరాల పాటు సాగు చేస్తే నాలుగో సంవత్సరం నుంచి ఆదాయం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కాలంలో అంతర్ పంటల ద్వారా కూడా రైతులు ఆదాయం పొందవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాలెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ సుహాసిని, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శైల, డాక్టర్ ఆదిశంకర్, జిల్లా హార్టికల్చర్ అధికారి వెంకటేశం, వ్యవసాయ అధికారి పూర్ణచంద్రారెడ్డి, హార్టికల్చర్ అధికారులు జగన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.