- రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు.
- పాలక వర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర అవుతుంది.
- అయినా ఎన్నికల నిర్వహణలో జాప్యంపై ప్రశ్నించిన కోర్టు.
- ఎన్నికలు నిర్వహించాలంటూ ఆరు రిట్ పిటీషన్లు.
- పిటీషనర్, ప్రభుత్వం, ఈసీ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.
- ఎన్నికల నిర్వహణపై తుది తీర్పు ఇచ్చిన హైకోర్టు జస్టిస్ టీ మాధవీ దేవి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పంచాయతీ ఎన్నికల్లో మూడు నెలల్లోగా నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. వీలైనంత త్వరగా 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీకి అవసరమైన అన్ని రకాల సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన తుది తీర్పును జస్టిస్ టీ మాధవీ దేవి బుధవారం వెలువరించారు. కాగా గతేడాది జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిశాయి.గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై న్యాయస్థానంలో ఆరు రిట్ పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టులో తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.గతేడాది జనవరి 31వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను స్పెషల్ అధికారులకు అప్పగించడం, రాజ్యాంగానికి, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం అని పేర్కొన్నారు.ప్రత్యేకాధికారులు వారికున్న ఇతర విధుల్లో నిమగ్నమై ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని న్యాయస్ధానానికి వివరించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు తమ సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆ నిధులు అందక నానా అవస్థలు పడుతున్నారని, వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని తెలిపారు. వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలనీ లేదంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను చేపట్టాల్సి ఉందన్నారు.ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం మరో నెల రోజుల సమయం అవసరమని తెలిపారు.ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి కూడా మీరు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్.. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు.ఇది పూర్తికాగానే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపిన అనంతరం ప్రక్రియ పూర్తి చేయడానికి మరో రెండు నెలల సమయం పడుతుందన్నారు.అయితే దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు.సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అయినా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది సమాధానమిస్తూ రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు.వాదనలు విన్న న్యాయమూర్తి వచ్చే మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తీర్పును వెలువరించారు.