Take a fresh look at your lifestyle.

బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

  • సంస్థల ఎన్నికల్లో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
  • హైకోర్టు తీర్పుకనుగూణంగా స్థానిక సంస్థల ఎన్నికలు.
  • మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.హైకోర్టు తీర్పుకు అనుగుణంగా స్థానిక ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుభరోసా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలు, జుబ్లీహీల్స్‌ ఉపఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలతో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహలపై వరుస సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది కూడా తామేనని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. మూడు ముక్కలాటతో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అయిందని మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత చెప్పినట్టు బీఆర్‌ఎస్‌లో దెయ్యాలుంటే.. కాంగ్రెస్‌లో దేవతలున్నారని వ్యాఖ్యానించారు. పదేండ్లు అధికారంలో ఉండి ఏనాడూ మహిళల గురించి నోరు మెదపని ఎమ్మెల్సీ కవిత.. ఇప్పుడు వారి అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య. కవితకు మద్దతు మాట్లాడటం విచారకరమని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వెలగబెట్టింది ఏమి లేదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. దేశ చరిత్రలో అదో హేయమైన చర్య అన్నారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా..శిక్ష తప్పదని చెప్పారు. కాళేశ్వరంతో పాటు పలు కుంభకోణాలను వెలుగుతీసి ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నిధులను, పథకాలను మంజూరు చేయకుండా వివక్ష చూపిస్తోందని అన్నారు. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టుకోమని జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో హరీశ్ రావు సంతకం ఎందుకు పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అభూత కల్పనతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థను నడుపుతున్నారని.. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి ప్రచారాలను ప్రజలు తీప్పి కొట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ రైతు పక్షపాతి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.