ముద్ర ప్రతినిధి, మెదక్:
నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. శనివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్, మాజీ చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ కెమెరాలు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ… సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. దొంగతనాలు, చోరీలు జరిగితే సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను సులభంగా గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే అనేక కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడినట్లు వెల్లడించారు.
జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజల సహకారంతో మరింత భద్రత కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ప్రతి కాలనీ, గ్రామంలో కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలపై నియంత్రణ సాధ్యమవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ సీఐ మహేష్, ప్రజాప్రతినిధులు, దాతలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు