Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి.-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాలు.

 

ప్యాడి క్లీనర్స్ వినియోగిస్తేనే నాణ్యమైన ధాన్యం.

ఇతర రాష్ట్రాల ధాన్యం కేంద్రాలకు రాకుండా చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట చర్యలు అవసరం.

యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

గురువారం కేటీ దొడ్డి మండల కేంద్రంతోపాటు కొండాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి ముందుగా తీసుకొచ్చిన రైతుల ధాన్యానికి నిబంధనల ప్రకారం తేమ వస్తే వెంటనే తూకం చేసి మిల్లులకు తరలించాలన్నారు. ముందు వచ్చిన రైతులకు కాకుండా వెనుక వచ్చిన వారి ధాన్యం కొనుగోలు చేయడం సరికాదన్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే ఓపిఎంఎస్ కాకుంటే రైతులకు సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడతారన్నారు. కేంద్రం నిర్వహకులు, సంబంధిత అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్యాడి క్లీనర్స్ తో ధాన్యంను శుభ్రం చేయకుండా మిల్లులకు పంపిస్తే మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారన్నారు. దొడ్డు, సన్నరకం ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. లారీలు, హమాలీల సమస్య ఈ కేంద్రాల వద్ద లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ధాన్యం కుప్పలను పరిశీలించి నిర్దేశిత తేమ శాతం రాగానే తూకం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. లారీలలో సంబంధిత మిల్లులకు ధాన్యం పంపే క్రమంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. వివిధ రిజిస్టర్ లను పరిశీలించి, ట్రక్ షీట్ వివరాల్లో తప్పిదాలు ఉండడంతో సరిచేసి పంపాలని, నిబంధనలను అతిక్రమిస్తే షోకాజు నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

అనంతరం నందిన్నె అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద చేస్తున్న వాహనాల తనిఖీ విధానం, రిజిస్టర్ నిర్వహణ, ఆయా వాహనాల పత్రాల పరిశీలన తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల మొక్కజొన్న, వరి ధాన్యం రాకుండా చూడాలన్నారు. ప్రతి వాహనం యొక్క నంబర్, సరకు రవాణాకు సంబంధించిన బిల్లు నంబర్లు, సంబంధిత పత్రాల వివరాలను నిర్దేశిత రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. కేవలం జిరాక్స్ ప్రతులు తీసుకోవడం సరిపోదని, సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించి, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అవసరమైతే వాహన పత్రాల ఫోటోలు కూడా భద్రపరచాలని సూచించారు. చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా పని చేసి, ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే చెక్‌పోస్ట్ వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

అంతకుముందు కేటీ దొడ్డి మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవెల్ పూర్తయినందున మొదట అకాడమిక్ బ్లాక్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఒప్పందం ప్రకారం ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు. అన్ని జిల్లాల్లో పాఠశాల భవనం ప్లాన్ ఒకే విధంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో విద్యుత్ లైన్ మార్చాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.

ఈ పర్యటనలో పౌర సరఫరాల శాఖ మేనేజర్ విమల, డిఆర్డిఏ ఏపీడి శ్రీనివాస్, కేటీ దొడ్డి తహసిల్దార్ కరుణాకర్, ఎంపీడీవో రమణారావు, విద్యాశాఖ ఇంజనీర్ మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి రాజవర్ధన్ రెడ్డి, ఏపీఎం చంద్రశేఖర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.