Take a fresh look at your lifestyle.

కిడ్నీ రాకెట్ కేసులో ఏడుగురు అరెస్టు … పరారీలో మరో ఎనిమిది మంది

  • మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలింపు
  • 2023 నుంచి 2024 వరకు అక్రమంగా కిడ్నీల మార్పిడి
  • ఇప్పటి వరకు 20 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు
  • సర్జరీ కోసం రూ. 55 నుంచి రూ.60 లక్షల వరకు వసూలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 15 మంది నిందితులు ఉండగా, ఏడుగురు పట్టుబడ్డారు. మిగిలిన ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాతో సీపీ సుధీర్ బాబు మాట్లాడారు ఈ కేసులో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్, కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం. కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహెబ్ కూడా పరారీలో ఉన్నాడు. ఆర్గనైజర్లు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌ల జాడ కోసం వెతుకుతున్నామని సీపీ సుధీర్ బాబు చెప్పారు. మీడి యేటర్లు సూరజ్ మిశ్రా, శంకర్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారని ఆయన తెలిపారు.

చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అవినాష్.. ఇండియాకి తిరిగి వచ్చి పూణేలో డిప్లమా ఇన్ సర్జరీ పూర్తి చేశాడు. 2022లో హైదరాబాదులోని మాదన్నపేట లో ఉన్న జనని హాస్పిటల్ ను డాక్టర్ అవినాష్ అతని స్నేహితులు లీజుకు తీసుకున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు అవినాష్. ఈ క్రమంలో అతనికి వైజాగ్ కు చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలంటే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేయాలంటూ లక్ష్మణ్, డాక్టర్ అవినాష్‌ను లక్ష్మణ్ కోరాడు. ప్రతి కిడ్నీ మార్పిడి సర్జరీకి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. డోనర్లు, మెడికల్ అసిస్టెంట్లు, రిసెప్షనిస్టులను మొత్తం కూడా తానే చూసుకుంటానని అవినాష్ కు లక్ష్మణ్‌ చెప్పాడు. డాక్టర్ అవినాష్ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడంతో పాటు ఆపరేషన్ తర్వాత పేషెంట్లను చూసుకోవాల్సి ఉంటుంది అని ఒప్పందం కుదిరింది. అలా ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి చేస్తూ వచ్చారు. ఈ ఆపరేషన్ అన్నిటిని కూడా వైజాగ్ కి చెందిన పవన్, పూర్ణ, అభిషేకాలు చూసుకునేవారని సీపి సుధీర్ బాబు వెల్లడించారు.

“కిడ్నీ మార్పిడిలు చేయడానికి తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్, జమ్ముకాశ్మీర్ కి చెందిన డాక్టర్ సోహెబ్ తోపాటు తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌లు శంకర్, ప్రదీప్, కర్ణాటక చెందిన సూరజ్‌లను తీసుకొచ్చేవారు. కిడ్నీ మార్పిడి సర్జరీ కావాలనుకునే వారి దగ్గర నుంచి 55 నుండి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవారు. అందులో ఐదు లక్షలు కిడ్నీ డోనర్‌కు, రెండున్నర లక్షలు డాక్టర్ అవినాష్‌కు, పది లక్షల రూపాయలు కిడ్నీ మెయిన్ సర్జరీ చేసిన డాక్టర్లకి, ఆపరేటింగ్ థియేటర్ అసిస్టెంట్లకు 30,000 ఇచ్చేవారు. కానీ 2024లో జనని హాస్పిటల్‌ను డాక్టర్ అవినాష్ మూసివేశాడు. ఇదే సమయంలో అలకానంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమంత్‌ను డాక్టర్ అవినాష్ కలిశాడు. డాక్టర్ సుమంత్ కిర్జిస్థాన్‌లో మెడికల్ స్టడీస్ పూర్తి చేశాడు. అక్రమంగా కిడ్నీ మార్పిడి చేయడానికి ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటివరకు అలకనంద ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేశాకని అని సీపి సుధీర్ బాబు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.