కిస్మత్‌పురా, దర్గా, బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లి పరిధిలోని నిర్మాణాలు స్వాధీనం
రాజేంద్రనగర్ ఆర్‌డీవో వెంకట్ రెడ్డి
ముద్ర, హైదరాబాద్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. మూసీ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టబోయే పనులు.. తీసుకున్నచర్యలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నోటిషికేషన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయా నిర్మాణలకు అవసరమైన భూములను నిర్వాసితుల నుంచి సేకరించే పనిలో స్పీడ్ పెంచింది. మూసీ నది సరిహద్దుల నుంచి 50 మీటర్ల లోపల ఉన్న అన్ని నివాసాలు, ఇతర నిర్మాణాలను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ వడివడిగా అడుగులేస్తున్నది. ఈ ప్రక్రియను పారదర్శకగా నిర్వహించేందుకు దశలవారీగా ప్రణాళికలు సిద్ధం చేసింది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా బాధితుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన సర్కార్.. ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోపు ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేస్తామని ఇది వరకే ప్రకటించింది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుని నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది. నగర అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని మూసీ తీర ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరింది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ పరిధిలోని మూసీ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టబోయే చర్యలపై స్ధానిక ఆర్‌డీవో వెంకట్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామని, నిబంధనల ప్రకారం నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని కిస్మత్‌పురా, దర్గా ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసినట్లు ఆర్‌డీవో వెల్లడించారు. వీటితో పాటు బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లి పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా త్వరలోనే స్వాధీనం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. గత కొంతకాలంగా చర్చనీయాంశమైన మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ అంశంపై స్పష్టత ఇచ్చిన ఆర్‌డీవో… ఆ అపార్ట్‌మెంట్ పూర్తిగా మూసీ బఫర్ జోన్‌లోనే ఉందని ఆయన ధృవీకరించారు. గతంలో అన్ని అనుమతులు పొంది దీనిని నిర్మించినప్పటికీ, ప్రస్తుతం ప్రాజెక్టు నిబంధనల దృష్ట్యా దీనిని స్వాధీనం చేసుకోక తప్పదని పేర్కొన్నారు. అయితే నిబంధనల ప్రకారం బాధితులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతే అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంటామని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.