ఆలస్యం కాకుండా చూసుకోండి
ప్రభుత్వానికి లేఖరాసిన బలంగిర్-బర్‌గఢ్-మహాసముంద్ డివిజన్ (బీబీఎం) దళం
నేషనల్ డెస్క్ :
అజ్ఞాతం వీడి.. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ హామీ ఇచ్చారు. లొంగిపోయే మావోయిస్టుల భద్రత విషయంలో ఎలాంటి ముప్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సేఫ్ సరెండర్ కోరుతూ బలంగిర్-బర్‌గఢ్-మహాసముంద్ డివిజన్ (బీబీఎం)కు చెందిన మావోయిస్టులు రాసిన లేఖపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా బోర్డర్‌లో యాక్టివ్‌గా ఉండే బీబీఎం డివిజన్‌కు చెందిన 15 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మావోయిస్టు పార్టీ పశ్చిమ సబ్ జోనల్ సెక్రెటరీ వికాస్ పేరిట ఛత్తీస్ గఢ్ ప్రభుత్వానికి లేఖ అందిందని చెప్పారు. అయితే లొంగిపోయిన తమ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదంటూ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ రేడియోలో సందేశం ఇవ్వాలని ఈ లేఖలో కోరారని వివరించారు. రేడియో సందేశం బ్రాడ్‌కాస్ట్ అయిన తర్వాత వచ్చే నెల 2, లేదా 3న సభ్యులు రహస్య స్థావరాల నుంచి బయటకొచ్చి లొంగిపోతారని ఈ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ లేఖపై స్పందించిన విజయ్ శర్మ మీరు రాసిన లేఖ మాకు అందిందని ధ్రృవీకరించారు. అయితే లొంగిపోవడం మీ మీదే ఆధారపడి ఉంటుందన్న ఆయన.. అందుకే ప్రత్యేకంగా వికాస్ ను కోరుతున్నానని చెప్పారు. లేఖలో పేర్కొన్నట్లు డీబీసీ ముగ్గురు సభ్యులు, ఏరియా కమిటీకి చెందిన ఐదుగురు సభ్యులు, పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు మొత్తం పద్నాలుగు మంది బస్తర్‌కు చెందినవారు, ఒకరు తెలంగాణకు చెందినవారు అందరూ లొంగిపోవాలని విజయ్ శర్మ సూచించారు. మావోయిస్టుల్లో బస్తర్ వారైనా, తెలంగాణ వారైనా ఇద్దరూ తమ దృష్టిలో సమానమే అని చెప్పారు. తప్పకుండా అజ్ఞాతం వీడి బయటకు వచ్చేయాలన్న ఆయన మావోయిస్టలు చేతిలో ఉన్న ఆయుధాలు ఏవైనా ఉంటే వాటిని కూడా తీసుకురావాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా డంప్ చేసిన ఆయుధాలు ఉంటే వాటి గురించి సమాచారం ఇస్తే వాటిని కూడా క్లియర్ చేసుకుంటామని వెల్లడించారు. మార్చి 2, 3 తేదీలకు మించి ఆలస్యం కాకుండా చూసుకోవాలని సూచించారు.