తెలంగాణలో 25వేల మంది బోగస్ ఉద్యోగులు
ఆధార్ కార్డు లేకుండా జీతాలు
వారిని నియమించిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలకు రంగం సిద్ధం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలుపడ్డారు. ఎలాంటి అర్హత లేకుండానే 25వేలకు పైగా మంది అడ్డదారిలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తోన్న అధికారుల చేతులు తడిపి అక్రమ మార్గంలో పోస్టింగ్ లు పొందారు. ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనాలు తీసుకుంటూ భారీ మోసానికి తెరలేపారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఐఎఫ్ఎంఎస్ విధానం ద్వారా జీతాలు అందించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ వారి వివరాలు సేకరించింది. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తోన్న దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో 25వేల మంది కనీసం ఆధార్ కార్డులు కూడా లేకుండా, కేవలం కాగితాల మీద పేర్లు సృష్టించి ఏజెన్సీలు ఏళ్ల తరబడి జీతాలు డ్రా చేస్తున్నట్లు తేలింది. అక్రమ మార్గంలో ఉద్యోగాలు సంపాదించుకుని ప్రతి నెల రూ.వేలల్లో పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారిని గుర్తించి వారిని నియమించిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నిజిల్లాల కలెక్టర్లను ఆదేశించడం ఉద్యోగ వర్గాల్లో సంచలనం రేపింది. ఈ క్రమంలో ఈ నెల 3న రాస్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు.దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా బోగస్ ఉద్యోగులుగా ఇంతకాలం జీతాలు తీసుకున్నారని తెలిపారు. బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాటన్నింటిపైనా ఆడిట్ చేయించి ఆర్థిక శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలని సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోన్న సీఎం.. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న ‘బోగస్’ ఉద్యోగుల వ్యవహారాన్ని బయటపెట్టడం ఇప్పుడు రాజకీయ. పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
బయటపడిందిలా…
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపులో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ఈ విప్లవాత్మక మార్పు ద్వారా మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చని భావించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందిస్తోన్న ఐఎఫ్ఎంఎస్ విధానం ద్వారా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ పారదర్శకంగా వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే ప్రత్యేక ఆప్షన్ చేర్చాలా లేదా వీరి కోసమే సరికొత్త వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. ఈ విధానం అమల్లోకి వస్తే, ఏజెన్సీల ప్రమేయం లేకుండా ప్రతి నెల నిర్ణీత తేదీన ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విద్యా, ఇతర అర్హతలపై ఆరా తీసింది. ఇందులో చాలా మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా. బోగస్ సర్టిఫికెట్లు రూపొందించి అక్రమ మార్గంలో ఉద్యోగాలు సాధించినట్లు తేలింది. కాగా ఇన్నాళ్లు ప్రభుత్వం నిధులను సంబంధిత ఏజెన్సీలు లేదా శాఖాధిపతుల ఖాతాల్లో ఆయా ఉద్యోగుల వేతనాలు జమా చేసేది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ఏజెన్సీలు ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. లేని ఉద్యోగుల పేర్లతో అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో ఇలాంటి బినామీల గుట్టు రట్టయింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న పీఎఫ్, ఈఎస్ఐ నిధులను ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు తేలింది. కొత్త విధానంతో ఈ నిధులు నేరుగా లబ్ధిదారులకే అందుతాయి.