Take a fresh look at your lifestyle.

ఎస్సీ వర్గీకరణకు గవర్నర్​ ఆమోదం

  • శాసనసభ, మండలి ఆమోదించిన వర్గీకరణ బిల్లుకు జిష్ణుదేవ్‌వర్మ సమ్మతి.
  • 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజన.
  • 15 శాతం రిజర్వేషన్లకు ఓకే.
  • త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు.
  • సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఎనిమిది నెలల్లోనే ప్రక్రియ పూర్తి.
  • ఇకపై ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు.
  • ఎస్సీ వర్గాల్లో హర్షాతికేకలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణ విషయంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా గత నెల 19న శాసనసభ, మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ సమ్మతి తెలిపారు.గవర్నర్ ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారింది.ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం త్వరలోనే జీవోలు జారీ చేయనుంది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించిన ప్రభుత్వం ప్రస్తుతమున్న 15 శాతం రిజర్వేషన్లను ఆ మూడు గ్రూపులకు పంచింది.జనాభాకు తగ్గట్టు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రూపకల్పన చేసింది. ఇందులో ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్-1లో చేర్చారు. ఎస్సీల్లో వీరి జనాభా 3.288 శాతం కాగా, వీళ్లకు ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించారు.ఎస్సీల్లో ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు.ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్‌కు ప్రభుత్వం పంపించింది.కాగా గవర్నర్​ జిష్ణుదేవ్‌వర్మ రెండ్రోజుల క్రితమే బిల్లుకు ఆమోదం తెలిపగా..దాన్ని తిరిగి ప్రభుత్వానికి పంపించారు.బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.దీంతో ఇప్పటికే ఉభయ సభల్లో బిల్లు ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ..గవర్నర్​ ఆమోదముద్రతో కులగణన మాదిరిగా దేశానికి రోల్​ మోడల్​ గా నిలవనుంది.సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ..30 ఏళ్లుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం చేస్తూ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభించడంతో ఇక నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది.

  • అధికారంలోకి రాగానే కసరత్తు షురూ.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్​ సర్కార్​ ఎస్సీ వర్గీకరణ కోసం కసరత్తు ప్రారంభించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఓ రాష్ట్ర బృందాన్ని ఢిల్లీకి పంపింది. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించింది.సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది.తర్వాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి.. ఉభయ సభలో ఆమోదం తెలుపుకున్నది. ఇదే క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించిన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్ అక్తర్ కమిషన్ ఏర్పాటు చేసి తన చిత్తశుద్దిని నిరూపించుకున్నది. కమిషన్ ఇచ్చిన సూచనలను అమలు చేసింది. ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని క్రోడీకరించి కమిషన్ నివేదిక రూపొందించింది.59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి, 15 శాతం రిజర్వేషన్లను పంచిపెట్టింది. 59 కులాలు ఇప్పటి వరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసింది. ఏ,బీ,సీ,డీ, కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశం లేదని చేసిన కమిషన్ సిపార్సులతో పాటు ఎంపిరికల్ డేటాను ద‌‌‌‌‌‌‌‌ృష్టిలో పెట్టుకుని న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లును తయారు చేసింది.

  • ఉపసంఘం.. ఏకసభ్య కమిషన్‌.

గతేడాది ఆగస్టు 1న వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వర్గీకరణ అమలు చేస్తామంటూ ఆ రోజే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు.2024 సెప్టెంబరు 12న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని సైతం నియమించారు. విస్తృతస్థాయి సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని ఉపసంఘం సిఫార్సు చేసింది. 2024 అక్టోబరు 11న ప్రభుత్వం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.ఆ కమిషన్‌ విస్తృత అధ్యయనం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది.దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపగా..ప్రభుత్వం సంబంధిత బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. దానికి అన్ని రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయి.

  • గ్రూపుల వారీగా ఎస్సీ జనాభా.

గ్రూప్‌-1…(15కులాలు)

1.బావురి 2.బేడా(బుడగ) జంగం 3.చాచటి, 4.డక్కల్‌-డొక్కల్వార్‌ 5.జగ్గలి 6.కొలుపుల్వాండ్లు- పంబడ- పంబండ- పంబాలా 7.మాంగ్‌ 8.మాంగ్‌ గరోడి 9.మన్నే 10.మష్తీ 11.మాతంగి 12.మెహతర్‌ 13.ముండాల 14.సంబన్‌ 15.సప్రు

గ్రూప్‌-2…(18కులాలు)

1.అరుంధతీయ 2.బైండ్ల 3.చమర్, మోచి, ముచి, చమర్‌-రవిదాస్, చమర్‌-రోహిదాస్‌ 4.చంబర్‌ 5.చండాల 6.దందాసి 7.డోమ్, డోంబరా, పైడి, పానో 8.ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మలవాండ్లు 9.గోడారి 10.జాంబువులు 11.మాదిగ 12.మాదిగదాసు, మష్తీన్‌ 13.పామిడి 14.పంచమ, పరియ 15.సమగర 16.సింధొల్లు (చిందోల్లు) 17.యాటల 18.వల్లువన్‌.

గ్రూప్‌-3 (26 కులాలు)

1.ఆదిఆంధ్ర 2.ఆదిద్రావిడ 3.అనాముక్‌ 4.అరేమాల 5.అర్వమాల 6.బారికి 7.బ్యాగర, బ్యాగరి 8.చలవాడి 9.ఢోర్‌ 10.ఘాసి, హడ్డి, చాచండీ 11.గోసంగి, 12.హోలేయా 13.హోలేయ దాసరి 14.మాదాసి కురువ, మాదారి కురువ 15.మహర్‌ 16.మాల, మాలఅయ్యవార్‌ 17.మాలదాసరి 18.మాలదాసు 19.మాలహన్నాయ్‌ 20.మాలజంగం 21.మాలమస్తీ 22.మాలసాలే, నేతకాని 23.మాలసన్యాసి 24.మితఅయ్యల్వార్‌ 25.పాకీ, మోటీ, తోటి 26.రెల్లి.

  • మా కల నెరింది : మందుల సామేలు, తుంగతుర్తి ఎమ్మెల్యే.

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ఆమోదంతో మా సామాజిక వర్గీయుల దశాబ్దాల కల నెరవేరింది. ఎస్సి ఏబీసీడీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్, ఎస్సి వర్గీకరణ కోసం ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్న మాదిగల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి,ఎస్సి వర్గీకరణ ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వైస్ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వన్ మెన్ కమీషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ కు, వర్గీకరణ కు సహకరించిన అన్ని పార్టీలకు కృతజ్ఙతలు. ప్రత్యేక తెలంగాణ రావడానికి పని చేసిన అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ఎస్సి వర్గీకరణకు కూడా పనికి వచ్చింది. ఎస్సిలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని మరోసారి రుజువైంది.

Leave A Reply

Your email address will not be published.