- మంచి గ్రేడింగ్ వస్తే సిబ్బందికి అవార్డులు.
- పోషకాహార తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి.
- ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కనీసం 20 మంది పిల్లలు ఉండాలి.
- కందిపప్పు కొనుగోలులో సొంత నిర్ణయాలు కూడదు.
- ఈ-టెండర్ విధానాలను ఎందుకు పాటించడం లేదు?
- ఉన్నతాధికారులతో మంత్రి సీతక్ సమీక్ష.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పనితీరు ఆధారంగా అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్‌లు ఇస్తామని మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) చెప్పారు. మంచి గ్రేడింగ్‌లు వచ్చే కేంద్రాల సిబ్బందికి జిల్లా స్థాయిలో అవార్డులు పంపిణి చేస్తామన్నారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్షను మంత్రి సీతక్క నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోషకాహార తెలంగాణ లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని అన్నారు.చిన్నారులు లేరనే సాకుతో 313 అంగన్వాడీ కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడం సరికాదన్నారు.వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులతో కలకలలు ఆడాలన్నారు.ప్రతి సెంటర్‌లో కనీసం 20 మంది చిన్నారులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రాథమిక పాఠశాలల తరహాలోనే గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని మంత్రి సీతక్క సూచించారు.రాష్ట్రంలో 30 అంగన్వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరని, 198 కేంద్రాల్లో చిన్నారులు సంఖ్య 5లోపు ఉందని, 586 కేంద్రాల్లో పదిలోపు ఉందని ఆమె తెలిపారు. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచే బాధ్యత సిబ్బందిపైనే ఉందన్నారు. తమ ప్రజా ప్రభుత్వం చిన్నారుల సంక్షేమం కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుందని, అంగన్వాడీ సిబ్బంది సీరియస్‌గా ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు.కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? అని అధికారులను ఆమె నిలదీశారు.ఈ-టెండర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదు? అని ప్రశ్నించారు. అధికారుల తప్పిదాల వలన ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందని, దీనిపై అధికారులు సంజాయిషీ ఇవ్వాల్సిందే అని ఆమె ఆదేశించారు.పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిని నిలిపి వేసి ఈ- టెండర్ విధానాన్నీ అవలంబించాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్ మెంట్ కమిటీ ద్వారా టెండర్లు పిలవాలని సూచించారు.సామ్, మామ్ చిన్నారులను గుర్తించి రిపోర్ట్ చేయాలన్నారు. మీకు చెడ్డ పేరు వస్తుందని పిల్లల పోషకాహర లోపాన్ని దాచి పెడితే సమాజానికి నష్టం వస్తుందన్నారు. 50 శాతం మంది అసలు రిపోర్ట్ చేయడం లేదన్నారు. అందుకే చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా..బలహీనమైన పిల్లలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాలని ఆమె ఆదేశించారు.ఆ తరువాత ఏం చేయాలో తాము చెబుతామని ఆమె అన్నారు.పిల్లల అమ్మకాలు, బాల్య వివాహాలు, నిబంధనలకు విరుద్దంగా దత్తత లపై దృష్టి పెట్టాలన్నారు.ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించండి. వారిలో చైతన్యం తెచ్చే ప్రచార కార్యక్రమాలు చేపట్టండి.