Take a fresh look at your lifestyle.

శ్రీ స్వామివారికి 108 బంగారు పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ..

శ్రీభగవత్ రామానుజుల 1009వ తిరునక్షత్ర అభిషేక మహోత్సవం..
ముద్ర ప్రతినిధి యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో బుధవారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. శ్రీభగవత్ రామానుజుల వారి 1009వ తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠితమైన వారి విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల ఘోష మధ్య, పాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సమర్పించగా, భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీభగవత్ రామానుజుల వారి కృపాకటాక్షాలను పొందారు.
విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.