-
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
![]()
ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి, నిమిషములో కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవలలో భాగంగా తొలి రోజు స్వర్ణకవచాలంకృత విశేష అలంకరణలో సర్వమంగళ స్వరూపిణిగా లక్ష్మీశోభతో దేదీప్యమానంగా వెలుగు దివ్వెల కాంతులతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ దర్శన భాగ్యం కల్పించారు.
మంత్ర బీజాక్షర సమన్విత అయ్యిన ఈ స్వర్ణకవచంలో అమ్మవారిని దర్శిస్తే ఆరోగ్యం, ఆకర్షణశక్తి, ఐశ్వర్యం, మంత్రసిద్ధి, సకల శత్రుబాధలు తొలగి సకల విజయాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సోమవారం ఉదయం నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించు కుంటున్నారు. భక్తులకు ప్రసాదాలు మంచినీళ్ల వితరణ చేయడం జరిగింది, సామూహిక చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
బోడుప్పల్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు మొదటిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకుడు ఉమాకాంత శర్మ భక్తులతో ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఏర్పాట్లు చేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
