Take a fresh look at your lifestyle.

అవినీతి, కమీషన్లు లక్ష్యంగా ప్రభుత్వ పాలన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు

 

*ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగి పోయిందని, కమీషన్లు లక్ష్యంగా పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. పట్టణాల అభివృద్ధి జరగాలంటే, అవినీతి రాజ్యం అంతరించాలన్నా బీజేపీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సోమవారం నిర్మల్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసం నుంచి జాతీయ రహదారి మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన లో పారదర్శకత లోపించిందని అన్నారు. గతంలోని బి ఆర్ ఎస్ ప్రభుత్వం, ఇపుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా పాలన సాగిస్తున్నాయని ఆరోపించారు. గత సర్కారు కమిషన్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు పాల్పడిందని, ప్రస్తుత ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బి ఆర్ ఎస్ పై ఆరోపణలు చేస్తోందన్నారు. బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎం ఐ ఎం పార్టీతో కుమ్మక్కయ్యాయని అన్నారు. బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు సదరు మూడు పార్టీలు చేయని ప్రయత్నమంటూ లేదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే, వాటి పేర్లు మార్చి తమ ఖాతాలో వేసుకుంటున్నాయన్నారు. సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్ తమ పార్టీ లక్ష్యమని అన్నారు. చోర్ వర్గ పాలనకు చరమ గీతం పాడేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు. నిర్మల్ జిల్లాలోని పురపాలికల్లో బీజేపీ అధికారం చేపట్టేలా ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రామ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.