- నేడు ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు.
- కార్యక్రమం ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సిరిసిల్లలోని పెద్దూరు ఆపేరెల్ పార్క్ లో రూ. 102 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమకు నేడు అంకురార్పణ జరగనుంది.రాష్ట్ర వ్యవసాయ, జౌళి, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేడు ఈ పరిశ్రమను ప్రారంభించనున్నారు.గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, ఇతర అధికారులతో సమావేశమైన మంత్రులు ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతంత మాత్రం ఆదాయంతో ఇబ్బంది పడుతున్న బీడీలు చుట్టే మహిళలు, పద్మశాలి సామాజిక వర్గం వారికి కుట్టు పనిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక షెడ్లు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు.బెంగళూరుకు చెందిన టెక్స్ పోర్ట్ ఇండస్ట్రీస్ రూ.40 కోట్లతో యంత్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఇక్కడ రూపొంచిన దుస్తులను ‘టెక్స్ పోర్ట్’ వంద శాతం ఎగుమతి చేస్తుందని వివరించారు. ఏటా రూ. 300 కోట్ల విలువైన దుస్తులను టామీ హిల్ఫిగర్, రాబర్ట్ గ్రాహం, వ్యాన్స్, మైఖేల్ కోర్స్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తుందన్నారు.ఈ లెక్కన ఏటా 70 లక్షల పీస్ లు తయారు అవుతాయనీ ప్రస్తుతం వెయ్యి కుట్టు మిషన్లను ఏర్పాటు చేసి రెండు షిఫ్టుల్లో వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పిస్తారని చెప్పారు. మరో మూడేళ్లలో మరో 2వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం ఉద్యోగాలు పొందిన మహిళలకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
