Take a fresh look at your lifestyle.

సర్వమంగళకారిణిగా నిమిషాంబికా మాత

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ మాతా నిమిషాంబికా దేవి అమ్మవారు స‌ర్వ‌మంగ‌ళ‌కారిణిగా  శ్రీ మహాలక్ష్మి దేవి విశేష అలంకరణలో లక్ష్మీశోభతో వెలుగొందారు. దేదీప్యమానంగా వెలుగు దివ్వెల కాంతులతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అమ్మవారిని పూజిస్తే ఆ త‌ల్లి  ఐశ్వర్యాన్ని ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, విజ‌య‌, విద్య‌, సౌభాగ్య‌, సంతాన భాగ్యాల‌ను ప్ర‌సాదిస్తుందని భక్తుల విశ్వాసం.

   భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ బోడుప్పల్ శాఖ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి సౌజన్యంతో ఆదివారం నిమిషాంబిక ఆలయ ప్రాంగణంతో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. మాజీమంత్రి, స్థానిక శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ఆదివారం సర్వమంగళకారిణి రూపంలో వున్న నిమిషాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.

ఆదివారం ఉదయం నుంచే వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకులు ఉమాకాంత శర్మతో పాటు ఇతర అర్చకులు భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు గోత్రనామాదులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు  కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఏర్పాట్లు చేశారు.  నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.