Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ప్రపంచ స్ధాయి పోటీలు

  • ప్రణాళికల రూపకల్పనలో ప్రజా ప్రభుత్వం నిమగ్నం.
  • తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సర్కార్ లక్ష్యం.
  • తెలంగాణ రైజింగ్ అనే ఆలోచనలో ఈ దార్శనికత ఇమిడి ఉంది.
  • హైదరాబాద్‌ను ప్రపంచంలోని అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం.
  • ప్రభుత్వ సంకల్పంలో అందరి బాగస్వామ్యం అవసరం.
  • సొనాటా సాఫ్ట్‌వేర్ నూతన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ప్రపంచ స్ధాయి పోటీలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పనలో ప్రజా ప్రభుత్వం నిమగ్నమై ఉందని వెల్లడించారు.తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతుందని చెప్పారు.తెలంగాణ రైజింగ్ అనే ఆలోచనలో ఈ దార్శనికత ఇమిడి ఉందని చెప్పారు.నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ నూతన ఫెసిలిటీ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, హైదరాబాద్‌ను ప్రపంచంలోని అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలను ఈ వేదికగా వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో, తెలంగాణ అభివృద్ధిని ప్రపంచం ముందు చాటడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని ఆకాంక్షించారు.హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు.హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్ గా మారిందనీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్, ఏఐ -రెడీ డేటా సెంటర్లలో ప్రముఖంగా నిలుస్తోందని సీఎం తెలిపారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి గ్లోబల్ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించాయని చెప్పారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు ఈ నగరం ఆతిథ్యమిస్తోందని వివరించారు. ఇలా తెలంగాణ అనేక కీలక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని సీఎం చెప్పారు.

  • గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కు హబ్‌గా హైదరాబాద్.

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఇంకా అనేక రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కు హబ్‌గా మారిందన్నారు. ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందన్నారు.నగరంలో అనేక ప్రముఖ కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరిస్తున్నాయని చెప్పారు.తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం పోలీసింగ్, చట్టాలను సరిగా అమలు చేయడంలో, ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కల్పన, పన్నుల వసూళ్లలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. స్వయం సహాయ సంఘాల ద్వారా 66 లక్షల మందికి పైగా మహిళలకు సాధికారత కల్పిస్తూ, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఫండింగ్, మెంటరింగ్ కార్యక్రమాన్ని తెలంగాణ అమలు చేస్తోందన్నారు. రాజీవ్ యువ వికాసం కార్యక్రమం ద్వారా వేలాది యువతకు వ్యాపార, స్వయం ఉపాధి రంగాల్లో మద్దతు అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.అలాగే సమానత్వం దిశగా కీలక అడుగు వేసిన తెలంగాణ, ట్రాన్స్‌జెండర్ వాలంటీర్లను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బృందంలో చేర్చిన మొదటి రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం డ్రైపోర్టును ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు వివరించారు.భారత దేశంలోనే అత్యంత శాస్త్రీయంగా ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ సమీపంలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో ప్రత్యేకంగా ఏఐ సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించడం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు తెలంగాణ రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దాదాపు 1 లక్షకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించినట్లు చెప్పారు.దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాల ద్వారా పెట్టుబడుల ఆకర్షణలో భారతదేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. దావోస్ సమావేశంలోనే రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు లభించాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

  • ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి శ్రీధర్ బాబు.

ఏఐ, మెషిన్ లెర్నింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ప్రపంచంలోనే తెలంగాణను లీడర్ గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని ఏఐ లీడర్ గా మార్చేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు.ఏఐ సిటీకి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.ఇందులో భాగస్వామయేందుకు మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపించాయని మంత్రి పేర్కొన్నారు.ఏఐలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేందుకు త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.పౌర సేవలను ఏఐతో అనుసంధానించి ప్రజల ముంగిటకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆన్ లైన్ లోనూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ కి అనుబంధంగా డిజిటల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.గ్లోబల్ కేపబిలిటి సెంటర్లకూ హైదరాబాద్ నగరం ఓ హబ్ గా మారిందని చెప్పారు.ఈ జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సోనాటా సాఫ్ట్‌వేర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సమీర్ ధీర్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.