భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం…మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం : సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుందామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన “భారత రాజ్యాంగం పరిరక్షణ – సవాళ్ళ” పై సెమినార్ లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగంలో ఉన్న లౌకిక, సోషలిస్ట్, సామ్యవాద పదాలు ఉచ్చరించేందుకు జంకుతున్నారని అన్నారు. రాజ్యాంగం అందించిన ఫలాలను అట్టడుగు ప్రజలకు అందకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం వల్ల రిజర్వేషన్లు కనుమరుగు చేస్తున్నారని అన్నారు. విద్యా, వైద్యం నుండి పేదలను దూరం నెట్టేస్తున్నారని తెలిపారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలలో ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో నియామకాలు చేపడుతున్నదని అన్నారు. దేశాన్ని పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపు తీసుకెళ్తుందని అన్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం నుండే సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం రద్దుచేసి బాగా డబ్బున్న కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు. ఈ లేబర్ కోడ్స్ యూనియన్లు పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, రాయబారాలు, సంప్రదింపులు లేకుండా చేసి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. పని గంటలు పెంచడంతోపాటు కనీస వేతనాలపై జవాబుదారితనం లేకుండా వదిలేసే పరిస్థితులు రానున్నాయని మొత్తంగా కార్మికులను శ్రమదోపిడి చేసి బానిసలుగా మార్చేందుకు కుట్రలు చేస్తుందని అన్నారు. పౌర సంబంధమైన క్రిమినల్ చట్టాలను రద్దుచేసి కొత్త చట్టాలను తీసుకొచ్చి పాలకవర్గాలకు, డబ్బున్న వారికి ఉపయోగపడే విధంగా ప్రజలకు వ్యతిరేకమైనవిగా తీసుకొచ్చిందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులను తమ భూముల నుండి తామంతట తామే వెళ్లిపోయేందుకు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, పట్టణ కన్వీనర్ గంధముల మాతయ్య, నాయకులు ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్ ఇటికల బిక్షపతి బాల నరసింహ సల్ల రాజయ్య బట్టు కొండయ్య రాజలింగం వరమ్మ శాంతమ్మ సత్యమ్మ సుజాత సునీత కుమారి పాల్గొన్నారు.