ముద్ర : కాప్రా
సహజ పానీయాలను అలవాటు చేసుకొని కూల్‌డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని కోరుతు జన విజ్ఞాన వేదిక పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జన విజ్ఞాన వేదిక మేడ్చల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఈసీఐఎల్ చౌరస్తాలో ఉగాది పండగ సందర్భంగా “కూల్‌డ్రింక్ మానేద్దాం – సహజ పానీయాలను తాగుదాం” అనే నినాదంతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పెద్ది శ్రీనివాస్ గుప్తా, వాసవి క్లబ్ కోశాధికారి తారకేశ్వర్ లు మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరమని, వీటి వినియోగం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మన పూర్వీకులు అనుసరించిన సహజ పానీయాలు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. ఉగాది పచ్చడి వంటి సంప్రదాయ ఆహారాలు జీవన విధానంలో భాగమని, ఇవి మన సంస్కృతి, ఆరోగ్య పరిరక్షణకు ప్రతీకలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కోశాధికారి
పి.నాగరాజులు మాట్లాడుతూ.. రసాయనాలతో తయారయ్యే కూల్‌డ్రింక్స్ శరీరానికి మేలు చేయవని, వీటి బదులు నిమ్మరసం, పానకం, రాగిజావా, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి సహజ పానీయాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. పండుగల సందర్భాల్లో సంప్రదాయ ఆహారాల ప్రాముఖ్యతను గుర్తించి, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.