కరీంనగర్ నగరంలో హోలీ పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పొన్నం కాంప్లెక్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులతో ఆనందంగా హోలీ జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వతాల మల్లేశం, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రావణ్ నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు శాసనసభ్యుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల జీవితాలు హోలీ రంగుల్లా ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పరస్పరం రంగులు చల్లుకుంటూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.