అంబేద్కర్ కళాభవన్ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి రూ.3 కోట్లతో నిర్మాణం.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
ముద్ర ప్రతినిధి, కొల్లాపూర్
కొల్లాపూర్ పట్టణంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అంబేద్కర్ కళాభవన్ నిర్మాణ పనులను జూపల్లి కృష్ణారావు శనివారం పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించి, భవన నమూనాను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి కళాభవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలకు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఈ కళాభవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించిన మంత్రి, నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.