విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి వైభవంగా విద్యా వారోత్సవాలు విద్యా వారోత్సవాల్లో మెరిసిన విద్యార్థుల ప్రతిభ
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్
గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సాంస్కృతిక, క్రీడా, సృజనాత్మక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు శనివారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అత్యంత వైభవంగా జరిగాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా ప్రదర్శనలు, ప్రతిభా ప్రదర్శనలు సభా ప్రాంగణాన్ని ఉత్సాహభరిత వాతావరణంతో నింపాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యాలు, జానపద కళారూపాలు, దేశభక్తి గీతాలు, సామాజిక సందేశాలతో కూడిన నాటికలను ఆసక్తిగా వీక్షించి అభినందించారు. విద్యార్థులు రూపొందించిన టీఎల్ఎం ప్రదర్శనలను తిలకించి వారి ప్రతిభను ప్రశంసించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, వేదికపై మాట్లాడే ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని తెలిపారు. భవిష్యత్ సమాజ నిర్మాణంలో విద్యార్థులే ప్రధాన శక్తిగా నిలుస్తారని, అందుకే వారిలో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్‌రూమ్స్, మౌలిక వసతుల అభివృద్ధి, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి అనేక సంస్కరణలు అమలు చేస్తోందని కలెక్టర్ వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని ఉన్నత లక్ష్యాల దిశగా నడిపించాలని సూచించారు.
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలడని ప్రోత్సహించారు.
విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, సైన్స్ ప్రదర్శనలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్, బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, నోడల్ అధికారి కురుమయ్య, సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, నూరుద్దీన్, వెంకటయ్య, మురళీధర్ రెడ్డి, శోభారాణి, షర్ఫుద్దీన్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగేశ్వర్ రావు, వివిధ మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.