Take a fresh look at your lifestyle.

పాదయాత్ర కాదు… పొర్లు దండాలయాత్ర చేపట్టాలి – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

……………………………………….
ముద్ర,ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
………………………………………
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేయడం కాదు పొర్లు దండాల యాత్ర చేపట్టినా పాలమూరు జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు.ఈ ప్రాజెక్టు పై గులాబీ పార్టీ చేసిన దుష్ప్రచారన్ని ఖండిస్తూ హైదరాబాద్ సీ ఎల్ పీ కార్యాలయం లో శనివారం మహబూబ్ నగర్, దేవరకద్ర, వనపర్తి, నాగర్ కర్నూల్ తదితర పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మీడియా తో మాట్లాడారు.ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మిడుతల దండులా ఒక్కటై రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శల దాడి చేశారని, ఇరిగేషన్, వరి కొనుగోళ్లు, జిల్లాకు సీఎం ఏమి చేశారంటూ మాట్లాడారన్నారు బిఆర్ఎస్ నాయకులు పదే, పదే మాట్లాడుతున్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజమే వేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల ప్రాజెక్టు జాలాశయం నుంచి నీరు తీసుకునేందుకు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. 10, జూన్ 2015 నాడు పాలమూరు ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టు నుంచి మార్పులు శ్రీశైలం జాలశయం నుంచి నీరు తీసుకునే విధంగా కెసిఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 105 తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.జూన్, 11, 2015న పాలమూరు జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కరివేన వద్ద పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేశారన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్ల ల్లో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారని,ఇక్కడే ఒక గెస్ట్ హౌస్ కట్టించండి.. కుర్చీ వేసుకుని ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని ప్రకటించి చేతులు దులుపుకున్నరన్నారు.2023 నవంబర్ నాటికి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో ఒక్క నాడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి పై రివ్యూ నిర్వహించలేదన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏ ఒక్క రోజు కెసిఆర్ ను అడగలేదని,కేసీఆర్ పై ఒత్తిడి చేయలేదని మధుసూదన్ రెడ్డి విమర్శించారు.మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న బిఆర్ఎస్ పాలకులు ఏడేళ్లఅనంతరం డిపిఆర్ సమర్పించారని, ఇక్కడే అర్థం చేసుకోవచ్చు జిల్లాకు చెందిన మంత్రుల, ఎమ్మెల్యేల అసమర్ధతనన్నారు. 90% పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేశామని అవాస్తవాలకు తెర లేపారన్నారు.రూ.33,500 కోట్ల వ్యయం అంచనాలతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ను ప్రారంభించారని, రూ. 55,500 కోట్ల వ్యయం తో డిపిఆర్ సమర్పించారన్నారు.
ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు ఎలా పూర్తి చేశారో బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ 11 రోజుల ముందు ఆఘామేఘాల మీద, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, నార్లపూర్ వద్ద కెసిఆర్ ఒక మోటర్ ఆన్ చేస్తే, కేసీఆర్ తిరిగి పాలమూరు నుంచి పట్నం వెళ్లే లోపు మోటార్ ఆగిపోయిందని విమర్శించారు.చరిత్రలో ఎక్కడ లేని విధంగా మెయిన్ కెనాల్ లకు భూసేకరణ చేయకుండా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన తెలిపారు.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదన్నారు. 2015 లోనే కాలువల నిర్మాణం కోసం భూసేకరణ చేసి ఉంటే తక్కువ ఖర్చులో భూసేకరణ జరిగి ఉండేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ. 86 వేల కోట్ల రూపాయల అంచనా ఉందని ఆయన వెల్లడించారు.అయినా మా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా, ఎన్నోసార్లు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి పై రివ్యూ సమావేశాలు నిర్వహించారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు ఖర్చు చేశామన్నారు.బిఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేస్తాం అనడం చూస్తుంటే వేయి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు అనిపిస్తుందన్నారు.ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరును పడావు పెట్టి, యుద్ధ ప్రాతిపదికన కాలేశ్వరాన్ని పూర్తి చేస్తుంటే, పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు పాలమూరు – రంగారెడ్డిని పూర్తి చేయమని కనీసం ఒత్తిడి చేసిన పాపాన పోలేదన్నారు.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పై, ముఖ్యమంత్రి గ పై బురదజల్లి అధికారంలోకి వస్తామని బిఆర్ఎస్ నాయకులు కలలు కంటున్నారన్నారు.మీరు వచ్చేది లేదని ,2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుందన్నారు. సమావేశం లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి,వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.