– పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పై బీ ఆర్ ఎస్ పోరుబాట
– పదేళ్లుగా లేని ఆరాటం… ఇప్పుడు పోరాటం ఎందుకో
– ప్రాజెక్టు పూర్తి కోసం పాదయాత్ర కు గులాబీ శ్రేణులు
– నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర కు ప్లాన్
– ప్రాజెక్టు పై పదేళ్లుగా నోరేత్తని నేతలు ప్రస్తుతం గగ్గోలు పెడుతున్నారు
– ఉనికిని కాపాడునేందుకే పాదయాత్ర అంటూ గులాబీ దళం పై విమర్శలు
– కెసిఆర్ ఎదుట నోరెత్తని మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యే లు సీఎం రేవంత్ రెడ్డి పై సెటైర్లు
– కెసిఆర్ హయాంలో నే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కు సమాధి కట్టారు
– బీ ఆర్ ఎస్ నేతలు పాదయాత్ర కాదు తపస్సు చేసినా జిల్లా ప్రజలు నమ్మరు
………………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
………………………………………
పదేళ్లు అధికారంలో ఉన్న కెసిఆర్ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో పూర్తి గా విఫలం చెందారననేది జగమెరిగిన సత్యం.అన్ని అరకొర పనులు చేసి ప్రాజెక్టుకు సమాధి కట్టారనేది నిత్య సత్యం. అధికారం లో ఉన్నన్ని రోజులు ఈ ప్రాజెక్టు పై బీ ఆర్ ఎస్ నేతలు సవతి ప్రేమ చూపించి పడావుపడేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి గా నార్లాపూర్ వద్ద ఒక పంపు ను ప్రారంభించి ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చారు. కాలువలు, జలశయాలు అసంపూర్తి దశలో ఉన్నా ఒక్క మోటార్ ప్రారంభించి చేతులు దులుపుకున్నారు.ఐదేళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు పనులు పడేళ్లు అయినా కెసిఆర్ పూర్తి చేయలేదు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు పనులు సాగదీశారనే విమర్శలు కెసిఆర్ పై వచ్చాయి. కెసిఆర్ హయాంలో జిల్లా కు చెందిన నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి మంత్రి పదవుల్లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు పనులు జరిగే నియోజకవర్గాల్లో బీ ఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యే లు బీరం హర్ష వర్ధన్ రెడ్డి,మర్రి జనార్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి భాద్యతల్లో ఉన్నారు. వీరంతా పదవులు అనుభవిస్తూ ఏనాడు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కెసిఆర్ వద్ద నోరేత్త లేదు.పదేళ్లుగా మౌనంగా ఉన్న వీరికి అధికారం పోయిన వెంటనే పాలమూరు జిల్లా లో ఉన్న సమస్య లు కంటికి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అధికారం లోకి వచ్చి రెండేళ్ళ కాలంలో పూర్తి అయినా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ను పట్టించుకోవడం లేదనే విషయం అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే లకు ఇప్పుడు గుర్తుకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి పై దుమ్మెత్తి పోస్తున్నారు.

………………………………………
అప్పుడు లేని ఆరాటం… ఇప్పుడు పోరాటం :
……………………………………….
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పై పదేళ్లు అధికారంలో ఉన్న బీ ఆర్ ఎస్ అసమర్థతను కప్పిపుచ్చేందుకు ప్రస్తుతం జిల్లా కు చెందిన అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే లు గత శుక్రవారం మహబూబ్ నగర్ లో సమావేశమై ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చేందుకు సమాలోచనలు చేశారు.ఈ ప్రాజెక్టు పై ఏదో ఒక కార్యక్రమం చేపట్టి జిల్లా లో మళ్ళీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా కలిసి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిన నార్లాపూర్ నుంచి ప్రాజెక్టు చివరి జాలశయం నిర్మించే ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టి రేవంత్ సర్కార్ పై ఒత్తిడి పెంచాల్లన్నదే వారి ఉదేశ్యంగా తెలుస్తోంది.ఈ సమావేశం లో బీ ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై పాదయాత్ర పై పలు సూచనలు చేశారు. ఈ పాదయాత్ర తో కాంగ్రెస్ సర్కార్ ను ఇరుకున పడేయడమే కాకుండా ప్రజల్లో కూడా బీ ఆర్ ఎస్ ఇంకా ఉందనే నమ్మకం కలుగుతుందని వీరంతా అనుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా ప్రాజెక్టు ను పూర్తి చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విషయం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని గులాబీ శ్రేణులు అంటున్నారు. రెండేళ్లు అయినా ప్రాజెక్టు పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని వారంటున్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ నేతలు ఎన్ని పాదయాత్ర లు చేసినా తపస్సు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

…………………………………….
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు స్వరూపం :
…………………………………….
దాదాపు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, హైదరాబాద్ నగరంతో సహా ఆయా జిల్లాల్లోని సుమారు 1,200 పైగా గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని పంపింగ్ చేసి రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం లక్ష్మీదేవిపల్లి వరకు పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం.ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలూ నిర్మిస్తారు. ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో – మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌసులు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి అవసరాలూ, పారిశ్రామిక అవసరాలూ తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు ఇతర సదుపాయాలను నిర్మిస్తారు.
2015 లో అప్పటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.ఇదేళ్ల లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు పనులు నత్తకు నడకలు నేర్పించింది. ఎనిమిదేళ్ల తరువాత
2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్యూటర్ ద్వారా ఒక పంప్ ను స్విచ్ ఆన్ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించాడు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌లోకి వదిలిన కృష్ణమ్మ జలాలకు కెసిఆర్ పూజలు చేశారు. తొమ్మిది మోటార్లకు ఒక మోటారు పనులు మాత్రమే పూర్తి కావడం ఆ మోటార్ ను కెసిఆర్ ప్రారంభించిన కొద్ది సేపటికే ఆఫ్ చేయడం వంటి పనులు జరిగిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం సీఎంగా జిల్లా కు చెందిన రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి.

బీ ఆర్ ఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా వదిలి వెళ్లడంతో నేటికీ పనుల్లో ముందడుగు పడలేదు. కాలువల, జాలాశయం పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. గత ఏడాది రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు వద్దకు వచ్చి చూసి వెంటనే పనులు పూర్తి చేస్తామని చెప్పినా ఇంతవరకు పనుల జాడ కనిపించడం లేదు. రెండేళ్ల రేవంత్ సర్కార్ హయాంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లేదని, ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలనే ఉదేశ్యం తో గులాబీ దళం పాదయాత్ర పేరుతో పోరుబాటకు దండు కట్టారు.
……………………………………