ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలిందని, రెండేళ్ల తర్వాత ప్రభుత్వం బి ఆర్ ఎస్ దేనని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో ఆయనకు పార్టీ శ్రేణులు గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా వారికి ఆయన అభివాదం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వానికి పరిపాటి అయిందని విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తమ హామీలు అమలు పరచటం లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. రెండేళ్ల తర్వాత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ నాయక్ తదితరులున్నారు.