- ఫైనాన్స్ శాఖలో మొత్తం లెక్కలు తవ్వుతున్న.
- బీఆర్ఎస్ ఆందోళనకు అదే కారణం.
- అన్ని తీసి సభ ముందు పెడతారని భయపడుతున్నారు.
- కచ్చితంగా సభ ముందు పెట్టి తీరుతాం.
- అప్పులు అన్ని పక్కాగా ఉన్నవే.
- ప్రతిదీ రికార్డుల్లో ఉంది.
- తొండివాదన చేస్తామంటే మేం ఏం చేయలేం.
- ద్రవ్యవినిమయ బిల్లుపై ఆర్ధిక శాఖ మంత్రి భట్టి సమాధానం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వ పాలనలో గాడి తప్పిన లెక్కలను తవ్వుతున్నందుకే బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైందని డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం చేసిన కేటాయింపులు. చేసిన ఖర్చు వివరాలను, ఆర్థిక శాఖలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని తవ్వి తీసి వాస్తవాలను అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.సంక్షేమమే తమకు ప్రాధాన్యత రంగమని భట్టి స్పష్టం చేశారు.రాబడి ఖర్చు ఏయే శాఖలకు ఎంత కేటాయింపులు అర్థవంతంగా అవసరాలకు తగిన విధంగా బడ్జెట్ రూపొందించినట్లు వివరించారు.ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ, శ్రీ శిశు సంక్షేమం కోసం 70,474 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి చేయలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆర్థిక, సామాజిక, రాజకీయ సర్వే జరిపించామని చెప్పారు. రాష్ట్రంలో 86 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి మీరు నిధులు ఖర్చు చేయలేదని నిర్ధారించినట్లు వెల్లడించారు.తాము రాష్ట్ర చరిత్రలోనే సంక్షేమం కోసం మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసినట్లు వివరించారు.రూ. 3.04లక్ష కోట్ల బడ్జెట్ లో రూ.1,44,156 కోట్లు సంక్షేమం కోసం కేటాయించినట్లు వివరించారు. రాష్ట్ర రాబడినీ దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు వివరించారు.గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులు (ఉద్యోగుల బకాయిలు కాకుండానే) పెండింగ్లో పెట్టి పోయారన్నారు. అలాగే రూ 1,59,940 లక్షల కోట్ల పనులు మంజూరు చేసి పోయారన్నారు. మొత్తం ఉద్యోగుల బకాయిలు రూ. 20వేల కోట్లు ఉంటే అందులో తాము రూ.16 వేల కోట్లు క్లియర్ చేశామని భట్టి వివరించారు. పాలనలో భాగస్వాములు ఉద్యోగులు.. వారిని పిలిచి బకాయిలకు సంబంధించి వివరాలు వెల్లడించి రాబోయే రోజుల్లో వాటిని ఎలా క్లియర్ చేస్తామో ఉద్యోగులకు వివరించగా వారు సంతృప్తి చెందారని డిప్యూటీ సీఎం చెప్పారు. బీఆర్ఎస్ నేతలు రూ.లక్ష కోట్లు అప్పు తెచ్చి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారన్నారు. తెచ్చిన అప్పులకు పదేళ్ల తర్వాత చెల్లింపులు ప్రారంభం అయ్యాయని వివరించారు.ఆ రూ. లక్ష కోట్లు అప్పులు తమపై భారం వేశారన్నారు. పెండింగ్ బిల్స్ రీపేమెంట్ భారం తమప్రభుత్వం పైపడినా..మీలాగా 20శాతం అంచనాలు పెంచకుండా వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ గడిచిన పదేళ్లుగా స్వయం ఉపాధి పథకాలను పట్టించుకోలేదని భట్టి ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకున్న తాము రూ. 6వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టీనట్లు చెప్పారు. బ్యాంకు లింకేజీ తో కలిపి మొదటి ఏడాది రూ. తొమ్మిది వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు నిరుద్యోగులకు అందించబోతున్నట్లు వివరించారు. వైశ్య కార్పొరేషన్కు రూ.25 కోట్లు, బ్రాహ్మణ పరిషత్ కు గతంలో రూ. 50 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో దానిని రూ. 100 కోట్లకు పెంచామన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 40 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. లక్ష మంది అధికారులతో నభూతో న భవిష్యత్తు అన్నట్టు కుల సర్వే చేశామన్నారు. ఈ రాష్ట్ర వనరులు వెనుకబడిన పేద వర్గాలకు ఎలా పంచాలి అనే విషయం రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ కు చిత్తశుద్దితో ఉందనీ అందుకే సర్వే పూర్తి చేశామన్నారు. వనరులు రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం పంపిణీకి విశ్లేషణ చేస్తున్నట్లు వివరించారు. మీలాగా దోపిడీ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి చెప్పారు. సమాజంలో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పరిష్కారం కాలేదు.వాళ్లకు వాటా దక్కాలని తమప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందన్నారు.దశాబ్దాలుగా పరిష్కరించని సమస్యను తమ క్యాబినెట్ పరిష్కరించిందని చెప్పారు.కుల సర్వే ద్వారా అధ్యయనం చేశామన్న భట్టి ఆ లెక్కన సంక్షేమానికి నిధులు పెట్టినట్లు వివరించారు.అవి ఖర్చు పెట్టే బాధ్యత తమప్రభుత్వానిదేనననారు.ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామనీ అందుకే బడ్జెట్లో రూ. 56,084 కోట్లు కేటాయించినట్లు వివరించారు.