Take a fresh look at your lifestyle.

నేను కక్ష పెట్టుకుంటే మీరందరూ జైళ్లో ఉండేటోళ్లు

  • సీఎంగా తలుచుకుంటే మిమ్మల్ని చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో పెట్టించేవాడిని.
  • డ్రోన్ ఎగురవేశా అని అధికారాన్ని అడ్డంపెట్టుకుని నన్ను అరెస్ట్ చేశారు.
  • కరుడుగట్టిన నక్సలైట్లను బంధించినట్లు నన్ను 16 రోజులు జైలులో బంధించారు.
  • నా కూతురి పెళ్లికి కూడా రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
  • మానసిక క్షోభతో నేను ఒక్కరోజు కూడా నిద్రపోలేదు.
  • నా ప్రమాణ స్వీకారం రోజే దేవుడే వాళ్లను ఆస్పత్రి పాలు చేశాడు.
  • లగచర్ల భూసేకరణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
  • ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల ఘాట్ భూసేకరణ విషయంలో బూట్లతో తొక్కించింది మీరు కాదా..?
  • మేం ఆనాడు అక్కడ ధర్నా చేశాం కానీ భూసేకరణకు వ్యతిరేకంగా కాదు పరిహారం పెంపుకోసం చేశాం.
  • మా పోరాటంతోనే మల్లన్న సాగర్ బాధితులకు పరిహారం పెంచారు.
  • కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ గౌస్ కు నీళ్లు తీసుకెళ్లింది నిజం కాదా?
  • రంగనాయకసాగర్ దగ్గర హరీష్ రావుకి ఫామ్ హౌసు ఉంది నిజం కాదా?
  • దీనిపై విచారణకు మీరు సిద్దమైతే నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం.
  • కాళేశ్వరం అవినీతిపై విచారణ కమిషన్ నివేదికను వచ్చే సభలో పెడతాం.
  • ప్రజలు తిరస్కరించినా బుకాయిస్తున్నారు.
  • తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారు.
  • శాసనసభలో కేటీఆర్​ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ప్రభుత్వం ఎవరి పైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 15 నెలల తమ పాలనలో బీఆర్​ఎస్​ పదేండ్ల గాయాలకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సీఎంగా తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడితే మిమ్మల్ని చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో పెట్టించేవాడినని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతుందంటూ గురువారం అసెంబ్లీలో బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ చేసిన ఆరోపణలకు సీఎం కౌంటర్​ ఇచ్చారు. సహజంగా ఎవరైన అనుమతి లేకుండా డ్రోన్​ ఎగురవేస్తే రూ. 5‌‌00 జరిమానా విధిస్తారన్న సీఎం అదే తాను కాంగ్రెస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ గా, ఎంపీగా ఉన్న నేను డ్రోన్​ ఎగురవేస్తే తనను అన్ని రకాల వ్యవస్ధలు, కేసులు ప్రయోగించి నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే సెల్​ లో వేసి తనను ఎంతో ఇబ్బందులకు గురిచేశారని బావోద్వేగానికి లోనయ్యారు. 16 రోజుల పాటు జైలులో పెట్టిన గత ప్రభుత్వం బల్లులు తిరిగే బాత్రూంలో బంధించిందని ఆరోపించారు. 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్ లో మనిషి కూడా కనిపించకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాను తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదని వ్యాఖ్యానించారు. మానసిక క్షోభతో నేను ఒక్కరోజు కూడా నిద్రపోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన కూతురి పెళ్లికి కూడా రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు బనాయించేందుకు ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. సొంత పార్టీ ఆఫీస్‌లో, సొంత పార్టీ నేతలతోనూ తనను తిట్టించారన్నారు.తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదని సీఎం పునరుద్ఘాటించారు.వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నానని సీఎం చెప్పారు.అందుకే నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడని చురకలంటించారు.

  • రైతులు, ప్రజలను బూట్లతో తొక్కించిందే మీరు..!

బీఆర్​ఎస్​ నేతలు మాటిమాటికి లగచర్ల భూసేకరణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల ఘాట్ భూసేకరణ విషయంలో బూట్లతో తొక్కించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో తాము కూడా అక్కడ ధర్నా చేశామే కానీ భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా చేయలేదని వివరణ ఇచ్చారు. కేవలం పరిహారం పెంపుకోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. తమ పోరాటంతోనే మల్లన్న సాగర్ బాధితులకు పరిహారం పెంచారని సీఎం వ్యాఖ్యానించారు. కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ గౌస్ కు నీళ్లు తీసుకెళ్లింది నిజం కాదా? అని కేటీఆర్​ ను ఉద్దేశించి చెప్పారు. రంగనాయకసాగర్ దగ్గర హరీష్ రావుకి ఫామ్ హౌసు ఉంది నిజం కాదా? అని నిలదీశారు. దీనిపై విచారణకు బీఆర్​ఎస్​ నేతలు సిద్దంగా ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని సభలో సీఎం సవాల్ విసిరారు. ఫామ్ హౌస్ చుట్టూ కాలువలు తీసుకెళ్ళింది ఆధారాలతో సహా అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయినా ఎందుకు బుకాయిస్తున్నారని నిలదీశారు. లగచర్లలో భూసేకరణలో బాధితులకు రూ.20 లక్షలు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు సీఎం సభలో స్పష్టం చేశారు. లగచర్ల భూసేకరణ జరగకుండా మీరు అధికారులను చంపండి అని మీ మాజీ ఎమ్మెలే అక్కడి వాళ్లకి చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. అధికారులను చంపాలని ప్రోత్సహించిన మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.36 వేల కోట్ల నుంచి లక్షా 50 వేలకు పెంచిన మీరు అధికారం నుంచి దిగిపోయే నాటికి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 1.02లక్ష కోట్లు బిల్లులు చెల్లించారన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై కాళేశ్వరం విచారణ కమిషన్​ సమగ్ర నివేదిక ఇచ్చిందని సీఎం చెప్పారు. ఆ నివేదికను వచ్చే సభలో పెడతామన్నారు. అసలు రైతులు, ప్రజల నుంచి బలవంతంగా భూములు గుంజుకుంది బీఆర్​ఎస్​ సర్కారే అన్నారు. 15 నెలల తమ పాలనలో మల్లన్న సాగర్,శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు తీసుకొచ్చినట్లు సీఎం వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రూ. లక్ష కోట్లతో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులతో జరిగిన ప్రయోజనం గుండుసున్న అన్నారు.
బీఆర్​ఎస్​ నేతలు తెలంగా జాతిపితగా అభివర్ణిస్తోన్న కేసీఆర్ ను కామారెడ్డి బండకేసి కొట్టారని సీఎం సెటైర్లు వేశారు.

  • వచ్చే ఐదేళ్లూ మాదే అధికారం.. ప్రతిపక్షంలో ఉండాలంటే సలహాలివ్వండి

వచ్చే ఐదేళ్లు కూడా రాష్ట్రంలో తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వాలని బీఆర్​ఎస్​ నేతలకు చురకలంటించారు. నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం ఆయన తన కుటుంబం మొత్తాన్ని ఏకే 47 తో కాల్చి చంపాడనీ అలా మీరు పెద్దాయన (కేసీఆర్​)ను ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలని చూడొద్దని కేటీఆర్​, హరీశ్​ రావును ఉద్దేశించి చెప్పారు. మీకున్న తెలివితేటలను రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని సూచించారు. తమ పాలనలో రూ. లక్ష రుణమాఫీ చేశామన్న కెసీఆర్ నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లు మాత్రమే అన్నారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ రూ. 13,514 కోట్లు అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో రైతుల రుణమాఫీకి రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. చివరి ఏడాదిలో 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. ఈ లెక్కన పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమే అని సీఎం చెప్పారు. మేము అధికారంలోకి వచ్చాక పది నెలల్లో 25,35,964 మంది రైతులకు రూ. 20,616,89 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. పదేళ్లలో మీరు చేసింది ఎంత? పది నెలల్లో మేం చేసింది ఎంత? పోల్చుకుందామా అని ప్రశ్నించారు. మీరు పదేళ్లు చేయలేనివి మేం పదినెలల్లో చేస్తే అభినందించాల్సింది పోయి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని బీఆర్​ఎస్​ నేతలపై మండిపడ్డారు. తనను అభినందించకపోయినా ఫరవాలేదు కానీ ప్రభుత్వాన్ని అభినందించవచ్చు కదా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.