ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలకు సన్నాహాలు పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 16న నిర్వహించనున్న మండల స్థాయి సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ Tejas Nand Lal Pawar అధికారులను ఆదేశించారు. బుధవారం వెబ్ ఎక్స్ ద్వారా జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం ప్రస్తుత మరియు రాబోయే ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అలాగే స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి అవసరాలను గుర్తించడం అని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్యం, పరిశుభ్రత, ఫైల్ క్లియరెన్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అరైవ్–అలైవ్ థీమాటిక్ వీక్‌లో భాగంగా రహదారి భద్రతపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సమావేశాలకు వచ్చే ప్రజలకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు వంటి అంశాలపై చైతన్యం కల్పించి, రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించాలని అధికారులకు సూచించారు. అదనంగా, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో “నో హెల్మెట్–నో ఎంట్రీ” బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సమావేశాల్లో స్థానిక సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ K. Narasimha, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీఈఓ అశోక్, ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.