Take a fresh look at your lifestyle.

అధికార దుర్వినియోగం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మొదలు… మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం రాత్రి ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అందులో నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్‌ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడంతో పాటు వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. చట్టాన్ని సైతం లెక్కచేయకుండా.. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయమన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ చేసిన కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన పార్టీ శ్రేణులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హృదయ పూర్వక ధన్యవాదాలని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.