Take a fresh look at your lifestyle.

కోదాడ పట్టణంలో ఈడీ సోదాలు కలకలం మనీ ల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దాడులు

 

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. కోదాడ పట్టణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిర్వహించిన సోదాలు తీవ్ర కలకలం రేపాయి. పట్టణానికి చెందిన ఒక వ్యాపారవేత్త కు సంబంధించిన ఇల్లు , వ్యాపార సంస్థలపై ఒకేసారి ఈడీ అధికారులు దాడులు చేపట్టారు.
ఈ సోదాల్లో భాగంగా నీలా సత్యనారాయణ నివాసంతో పాటు, అతనికి సంబంధించిన ఒక రైస్ మిల్, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక తవుడు మిల్లు, అలాగే అతని బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచే ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.
మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన కేసు నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం . వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాలను, సంబంధిత ప్రయోజనాల కోసం వినియోగించకుండా ఇతర వ్యాపారాలు, ఖాతాలకు మళ్లించారన్న అభియోగాలు , పన్ను ఎగవేత లకు సంబంధించిన కేసులు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈడీ అధికారులు పలు కీలక పత్రాలు, డిజిటల్ డేటా స్వాధీనం

సోదాల సమయంలో ఈడీ అధికారులు కీలకమైన ఆర్థిక పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు తదితర డిజిటల్ డేటాను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆధారాల ఆధారంగా మరింత లోతైన విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది .

పట్టణంలో ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికల వేళ ఈడీ సోదాల వార్త కోదాడ పట్టణంలో వేగంగా వ్యాపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది . పట్టణంలో మొదటిసారి ఈడీ దాడులు జరపటం వ్యాపార సంస్థలపై ఒకేసారి దాడులు జరగడంతో ప్రజలు, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.