ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
పలు రంగాల్లో పరస్పర సహకారంపై అంగీకారం
ముద్ర, తెలంగాణ బ్యూరో :

అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జూబ్లీహీల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ, డెలావేర్ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో కొనసాగాల్సిన ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎంతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డెలావేర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాలపై చర్చించారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక బోధనా పద్ధతుల అమలుపై చర్చలు జరిపారు. సాంకేతిక యుగంలో సమాచార భద్రత, డేటా ప్రొటెక్షన్ చట్టాలపై ఇద్దరూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. డెలావేర్ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం అమలు చేసిన గృహ నిర్మాణ పథకాలు, రుణమాఫీ వంటి అంశాలను గవర్నర్ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని గవర్నర్ మాట్ మేయర్ అభినందించారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలిసి డెలావేర్ రాష్ట్రానికి పర్యటనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.